శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 17, 2020 , 12:06:15

ఢిల్లీ హైకోర్టుకు టాలీవుడ్‌ భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌..

ఢిల్లీ హైకోర్టుకు టాలీవుడ్‌ భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌..

న్యూఢిల్లీ : సినీ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు వార్తలు ప్రసారం కాకుండా సమాచారశాఖకు ఆదేశాలివ్వాలని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పిటిషన్‌లో కోర్టును కోరింది. జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీం కోర్టు స్పందించిందని పేర్కొంది. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పిందని జస్టిస్‌ నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించారు. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలని హైకోర్టు మీడియా సంస్థలకు సూచించింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.

కాగా, బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ మాఫియా లీలలు వెలుగు చూశాయి. సుశాంత్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్న రియా చక్రవర్తి అరెస్టుతో డ్రగ్స్‌ కుంభకోణం వెలుగు చూసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల విచార‌ణ‌లో సుమారు 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉందని రియా విచారణలో తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ తనతో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రియా విచారణలో ఎవరి పేర్లు చెప్పలేదని వార్తలు వచ్చాయి. మరోసారి విచారణలో పేర్లు చెప్పిందని, ఇందులో రకుల్‌, సారా పేర్లు ఉన్నాయని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo