ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 18:46:25

చిరంజీవి నిర్ణ‌యాల‌తో అభిమానుల్లో క‌ల‌వ‌రం..!

చిరంజీవి నిర్ణ‌యాల‌తో అభిమానుల్లో క‌ల‌వ‌రం..!

పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా పవర్ తగ్గని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి హిట్ కొట్టాడు మెగాస్టార్. ఖైదీ నెం 150 సినిమాతో 100 కోట్ల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ షేర్ అనిపించాడు చిరంజీవి. ఆ తర్వాత సైరా కూడా తెలుగులో విజయం సాధించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి వరస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇన్ని చేస్తున్నా కూడా అభిమానులను మాత్రం ఈయన నిర్ణయాలు కలవరపెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎంచుకుంటున్న కథలే దానికి కారణం. చిరు వరస సినిమాలు అయితే చేస్తున్నాడు అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కానీ ఆ చేస్తున్న సినిమాలు మాత్రం అన్నీ రీమేక్ కథలే ఉన్నాయి. 

ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఆచార్య తప్పిస్తే చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలన్నీ కూడా రీమేకులే. ఇప్పటికే నవంబర్ 9 నుంచి ఆచార్య షూటింగ్ తిరిగి మొదలు పెట్టాడు కొరటాల శివ. రెండు నెలల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈయన. ఆచార్య తర్వాత వరసగా రెండు రీమేక్స్ చేయబోతున్నాడు చిరంజీవి. పైగా ఆయన పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కథ కూడా రీమేకే. కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150తో వచ్చాడు చిరంజీవి. ఆ తర్వాత సైరా కూడా చరిత్రే కానీ సొంత కథ కాదు. ఇప్పుడు కొరటాల ఆచార్య మాత్రమే స్ట్రెయిట్ సినిమా.

ఆచార్య తర్వాత మరో రెండు రీమేక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. తమిళ హిట్ వేదాళం.. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్స్ వెంటపడ్డాడు చిరంజీవి. మెగాస్టార్ లాంటి హీరో ఇలా వరసగా రీమేక్ సినిమాలు చేస్తుంటే అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ అంతగా భయం వెంటాడుతుందా లేదంటే నిజంగానే సొంత కథలను చిరంజీవి నమ్మడం మానేసాడా అనిపిస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మన టాలెంట్ ఎంకరేజ్ చేయకపోతే.. సొంత కథలు చేయకపోతే మన హీరోలు ఎందుకు ఇంక అంటూ విమర్శిస్తున్నారు. చూడాలి.. చిరు ఈ నిర్ణయాలను ఎప్పటికి మార్చుకుంటాడో..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.