‘తిమ్మరుసు’ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు తీయాలనే స్ఫూర్తినిచ్చింది’ అని చెప్పారు సత్యదేవ్. ఆయన టైటిల్ రోల్‌ను పోషించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. సత్యదేవ్ మాట్లాడుతూ ‘సెకండ్‌వేవ్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుండటంతో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ ప్రేక్షకుల ఆదరణ సంతోషాన్నిచ్చింది. కొవిడ్ టైమ్‌లో 39రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసి నిర్మాతలు తమ అంకితభావాన్ని చాటుకున్నారు. మా అందరి అంచనాల్ని ఈ సినిమా నిజం చేసింది’ అన్నారు. సెకండ్‌వేవ్ తర్వాత థియేటర్లో సినిమా విడుదల చేయడం చాలా రిస్క్ అని చాలా మంది సలహా ఇచ్చారని, అయితే ప్రేక్షకుల ఆదరణ తమలోని భయాల్ని పటాపంచలు చేసిందని నిర్మాత మహేష్ కోనేరు ఆనందం వ్యక్తం చేశారు. కథలోని కొత్తదనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.