శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 00:17:38

ఆనందం కోసం వ్యాయామం

ఆనందం కోసం వ్యాయామం

శారీరక దృఢత్వం కోసమే కాకుండా మానసిక ఆనందమే లక్ష్యంగా తాను వ్యాయామాలు చేస్తానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఫిట్‌నెస్‌కు సమంత చాలా ప్రాధాన్యతనిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. తన శారీరక కసరత్తుల తాలూకు వీడియోలను తరచుగా సోషల్‌మీడియాలో పంచుకుంటుంది. తాజా వీడియోలో ఫిట్‌నెస్‌కు సంబంధించి వివిధ అంశాలపై సమంత అభిమానులకు సూచనలిచ్చింది. ఫిట్‌నెస్‌ అంటే వ్యాయామం ఒక్కటే కాదని...ఇంకా చాలా మార్గాల్లో శారీరకంగా శక్తిని పొందగలమని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘బరువు పెరగడానికో లేదా నాజూకు శరీరం కోసమో వ్యాయామాలు చేయొద్దు. వ్యాయామాన్ని జీవన విధానంగా మార్చుకుంటే దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా మనలోని న్యూనతా భావాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం అలవడుతుంది. ఎక్సర్‌సైజ్‌ వల్ల ఆనందాన్ని పెంపొందించే హార్మోన్లు విడుదలవుతాయి. జిమ్‌లకు వెళ్లడం ఇష్టం లేకపోతే పచ్చటి ప్రకృతి నడుమ నడక సాగించండి. రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేయండి. వీటివల్ల శరీరంలో తెలియని ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సానుకూల దృక్పథంతో రోజంతా ఉత్సాహంగా గడుపుతాం. గత కొన్నేళ్లుగా నేను ఆనందంగా ఉండటానికి వ్యాయామం కూడా ఓ కారణం’ అని చెప్పుకొచ్చింది సమంత.