శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Jan 13, 2020 , 23:13:27

తారక్‌ సలహాలిస్తుంటాడు!

తారక్‌ సలహాలిస్తుంటాడు!

‘వాణిజ్య సమీకరణాలను పట్టించుకోకుండా కథల్లోని కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటారు కల్యాణ్‌రామ్‌. వివాదాలకు దూరంగా పరిశ్రమలో అజాతశత్రువుగా ఆయనకు మంచిపేరుంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంతమంచి వాడవురా’. సతీష్‌ వేగేశ్న దర్శకుడు. ఉమేష్‌గుప్తా, సుభాష్‌గుప్తా నిర్మాతలు. ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ చెప్పిన సంగతులివి..నిజజీవితంలో మిమ్మల్ని అందరూ మంచివాడని చెబుతుంటారు.

 మీ రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉండే పాత్రలో కనిపించడం ఎలా ఉంది?

-మనుషులందరూ మంచోళ్లు అని నేను నమ్ముతాను. అదే ఈ సినిమాలో చూపించబోతున్నాం. పరిస్థితుల కారణంగా కొందరు చేసే తప్పులు మనల్ని బాధపెడతాయి. వారిని చెడ్డవాళ్లుగా పరిగణిస్తుంటాం. ఆ తప్పుల్ని సరిదిద్దుతూ వారిని సరైన దారిలో నడిపించాలన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. 


క్యాచీగా ఉంటుందని ఈ టైటిల్‌ పెట్టారా? కథతో సంబంధం ఉంటుందా?

-జీవితంలో ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో తీసుకొనే  వ్యక్తిగా కనిపిస్తాను. చుట్టుపక్కల వారిలో అదే పాజిటివ్‌నెస్‌ను చూస్తుంటాను. నెగెటివ్‌ ఆలోచనల్ని దరి చేరనివ్వని మనస్తత్వముంటుంది. కథానుగుణంగా పాజిటివ్‌నెస్‌తో కూడిన టైటిల్‌ పెడితే బాగుంటుందని అనుకున్నాం. ‘ఆల్‌ఈజ్‌వెల్‌' అనే పేరును దర్శకుడు సతీష్‌వేగేశ్న సూచించాడు. అతడి గత సినిమాల టైటిల్స్‌ తెలుగు భాషతో నిండుతనంగా ఉంటాయి. ఈ కథకు తెలుగు టైటిల్‌ అయితేనే బాగుంటుందని క్యారెక్టర్‌కు అనుగుణంగా ‘ఎంత మంచివాడవురా’ అనే పేరును నిర్ణయించాం.  


ట్రైలర్‌లో మీ పాత్ర కొత్త పంథాలో కనిపిస్తున్నది?

రియల్‌లైఫ్‌లో మా ఇంట్లో ఎలా ఉంటానో అలాగే సింపుల్‌గా ఈ సినిమాలో కనిపిస్తాను. ఆద్యంతం సినిమాలో నేను నవ్వుతూనే ఉండాలని దర్శకుడు చెప్పారు. ఎప్పుడూ మీ ముఖంలో కోపం కనిపించకుండా ప్రశాంతంగా  ఉండాలన్నారు. అతడు చెప్పిన ఇన్‌పుట్స్‌ తీసుకుంటూ నా శైలిలో పాత్రలో ఒదిగిపోయాను. 


ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశమేది?

భిన్న వ్యక్తుల  జీవితాల్లోకి ఓ యువకుడు ఎలా ప్రవేశించాడు? సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారిలో అతడు ఎలాంటి మార్పు తీసుకొచ్చాడన్నది ఆకట్టుకుంటుంది. ఇందులో షార్ట్‌ఫిలిమ్స్‌ నిర్మించే వ్యక్తిగా నేను కనిపిస్తాను. షూటింగ్‌ చాలా సరదాగా సాగింది. భారంగా ఏ రోజు ఫీలవ్వలేదు.   సినిమాలో ‘రాముడు మంచోడే కానీ రావణాసురుడిని చంపలేదా’అంటూ  సతీష్‌ వేగేశ్న రాసిన డైలాగ్స్‌  ఆలోచనను రేకెత్తిస్తాయి. 


తెరపై పాత్రను పోషించడంలో మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

-‘శతమానంభవతి’  చూసి  నా భార్య ‘అలాంటి మంచి ఫీల్‌గుడ్‌ చిత్రాలు కాకుండా ఎప్పుడూ  కమర్షియల్‌ సినిమాలే  చేస్తారెందుకు’ అని అడిగింది. ఫ్యామిలీ కథలకు నేను సెట్‌ అవుతానని దర్శకుడు నమ్మినప్పుడే  అది సాధ్యమవుతుందని, మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నాను. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది.  


పెద్ద సినిమాలతో  పోటీగా సంక్రాంతి బరిలో నిలవడానికి కారణమేమిటి?

-రైతుల మాదిరిగానే సినిమా వాళ్లకు సంక్రాంతి పెద్ద పండుగ.  ప్రతి సంక్రాంతికి పెద్ద, మధ్యస్థాయి బడ్జెట్‌లతో కూడిన నాలుగైదు సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. సంక్రాంతి పోటీని కొత్తగా మేమే మొదలుపెట్టామని చెప్పడం లేదు. . ఫ్యామిలీస్‌ అందరూ చూడదగ్గ కథ కావడంతో  సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.అన్నయ్యను పూర్తిస్థాయి కుటుంబ కథలో చూడాలనే కోరిక ఈ సినిమాతో తీరిందని ప్రీరిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ అన్నారు. 


సినిమాలకు సంబంధించి ఎన్టీఆర్‌ మీకు సలహాలిస్తుంటారా?

-ఎన్టీఆర్‌, నాకు మధ్య తరచుగా సినిమాలకు సంబంధించిన ప్రస్థావన  వస్తుంటుంది.  ప్రతీది క్షుణ్ణంగా చర్చించడం కాకుండా చూచాయగా ఎన్టీఆర్‌ చెబుతుంటాడు  ఫలానా కథ నీకు బాగుంటుందని, రొటీన్‌గా సినిమాలు చేయడం కాకుండా కథల విషయంలో డిఫరెంట్‌గా ఆలోచించమని సలహాలిస్తుంటాడు.


మంచితనం వల్ల ఇండస్ట్రీలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?

మంచివాడిగా ఉండటం వల్ల బాగానే ఉన్నాను (నవ్వుతూ). నాకు ఇండస్ట్రీలో శత్రువులు లేరు. ఏ ప్రదేశంలోనైనా నాకు నచ్చితేనే ఉంటాను. ఇబ్బంది అనిపిస్తే వెళ్లిపోతాను. logo