సోమవారం 13 జూలై 2020
Cinema - Jan 24, 2020 , 13:33:33

'డిస్కోరాజా రివ్యూ'

'డిస్కోరాజా రివ్యూ'

రవితేజ సక్సెస్‌ అందుకొని చాలాకాలమైంది.  మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్న ఆయన వరుస పరాజయాలతో సక్సెస్‌ రేసులో వెనుకబడిపోయారు. తిరిగి పూర్వ వైభవాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆయన డిస్కోరాజాతో  ఏడాది విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు.  కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ కథాంశాలతో తెరకెక్కించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్కక్షణం చిత్రాలతో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న వి.ఐ.ఆనంద్‌  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సైంటిఫిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్స్‌, పోస్టర్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రవితేజ పాత్రచిత్రణ ఎలా ఉంటుందో చిత్రబృందం విడుదల వరకు రివీల్‌ చేయకపోవడంతో అభిమానుల్లో ఈ చిత్రం ఉత్కంఠను కలిగించింది. చిత్రబృందం గోప్యతకు కారణమేమిటి?రవితేజ ఈసినిమాతో తిరిగి సక్సెస్‌ అందుకున్నారా?లేదా?అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...


లఢఖ్‌లో పర్వతారోహకుల బృందానికి మంచులో గడ్డకట్టుకుపోయిన ఓ మృతదేహం కనిపిస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తిని బతికించడానికి ముంబాయికి చెందిన  శాస్త్రవేత్తల బృందం చేసిన  ప్రయత్నం ఫలిస్తుంది. ఆ వ్యక్తి తిరిగి బతుకుతాడు. అయితే తన గతాన్ని మర్చిపోతాడు. తాను ఎవరో తెలుసుకునే ప్రయత్నాల్లో  ఓ రాజకీయనాయకుడిని కొడతాడు. దాంతో దేశవ్యాప్తంగా అతడి పేరు మారుమ్రోగుతుంది.  తమ సోదరుడు వాసుగా(రవితేజ) భ్రమపడి ఢిల్లీ నుంచి అతడిని వెతుక్కుంటూ కుటుంబసభ్యులు వస్తారు. మరోవైపు ఆ వ్యక్తిని డిస్కోరాజా(రవితేజ) అనుకొని చెన్నైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ బర్మా సేతు(బాబీసింహా)  చంపడానికి ప్రయత్నిస్తాడు. తిరిగి ఊపిరి పోసుకున్న ఓ వ్యక్తి ఎవరు?డిస్కోరాజా, వాసు ఒకే పోలికలతో ఉండటానికి కారణం  ఏమిటి? 1970 కాలానికి చెందిన డిస్కోరాజాతో బర్మావాసుకు ఎందుకు శత్రుత్వమేర్పడింది?డిస్కోరాజా ప్రాణంగా ప్రేమించిన హెలెన్‌(పాయల్‌ రాజ్‌పుత్‌) ఏమైంది? తన కుటుంబసభ్యులతో పాటు ప్రియురాలు నభ(నభానటేష్‌) వాసు ఎలా కలుసుకున్నాడు అన్నదే మిగతా కథ.

ప్రతీకార నేపథ్యంతో కూడిన గ్యాంగ్‌స్టర్‌ కథకు సైంటిఫిక్‌ అంశాల్ని, వినోదాన్ని జోడించి దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ ఈసినిమాను తెరకెక్కించారు.  1970 కాలంలోనే చనిపోయిన ఓ గ్యాంగ్‌స్టర్‌ తన మరణానికి కారణమైన వారిపై  ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు?దూరమైన ఆప్తులను కలుసుకోవడానికి అతడు చేసిన ప్రయాణమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.   ఈ పాయింట్‌కు  1970-80కాలంతో పాటు ప్రస్తుత సమయాన్ని ముడిపెడుతూ కథాగమనాన్ని ఆసక్తికరంగా నడిపించారు దర్శకుడు.  రొటీన్‌ కథకు  స్క్రీన్‌ప్లే పరంగా కొత్త హంగులు అద్ది ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  సైంటిఫిక్‌ గ్యాంగ్‌స్టర్‌ సినిమాలు చాలా వరకు సీరియస్‌ అంశాలతో సాగుతాయి. కానీ దర్శకుడు పూర్తిగా ఈ చిత్రాన్ని వినోదభరితంగా తెరకెక్కించారు. రవితేజ శైలి కామెడీ టైమింగ్‌ మాస్‌ ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న ఉన్న ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకొని కథ, కథనాల్ని రాసుకొని ఈసినిమాను రూపొందించారు.


ప్రథమార్థం రీలైవ్‌ పేరుతో చనిపోయిన వ్యక్తిని బతికించడానికి శాస్త్రవేత్తల బృందం చేసే ప్రయత్నాలు,  తిరిగి ఊపిరి పోసుకున్న అతడు తన గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నాలతో  పరిచయఘట్టాలు నిదానంగా సాగుతాయి. తాను చెన్నైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ డిస్కోరాజా అని తెలుసుకునే యాక్షన్‌ ఎపిసోడ్‌తో కథాగమనంలో వేగం పెరుగుతుంది.డిస్కోరాజా ఎవరో, అతడి గతమేటనే ప్రశ్నలన్నింటికి ద్వితీయార్థంలో సమాధానం చెబుతూ ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వెళ్లారు దర్శకుడు. డిస్కోరాజా గతానికి సంబంధించిన 1970 కాలానికి చెందిన రెట్రోశైలి ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. ఆనాటి వేషభాషల్ని, సామాజిక పరిస్థితుల్ని సహజంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన ఈ సన్నివేశాలు  నవ్యమైన అనుభూతిని పంచుతాయి.  డిస్కోరాజా, బర్మా సేతు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి వేసే ఎత్తులు  అలరిస్తాయి. ఈ గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో సత్య, సునీల్‌, రాంకీలపై వచ్చే సన్నివేశాలతో నవ్వులను పంచారు దర్శకుడు.  మూగ, చెవిటి యువతి హెలెన్‌తో డిస్కోరాజా ప్రేమాయాణం, ఆమె కోసం చేసిన త్యాగం నుంచి సెంటిమెంట్‌ను రాబట్టుకున్నారు.  ఒకే పోలికలతో ఉన్న డిస్కోరాజా, వాసు మధ్య ఉన్న సంబంధమేమిటనే మలుపు ఆసక్తిని పంచుతుంది.  తన దగ్గర పనిచేసే ఉత్తరకుమార్‌ డిస్కోరాజాకు చేసిన మోసంతో పతాక ఘట్టాలు కొత్తగా సాగాయి.

లాజిక్‌లకు దూరంగా సాగే రొటీన్‌ రివేంజ్‌ డ్రామా ఇది.  చిన్న పాయింట్‌కు సైన్స్‌ పేరుతో దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ చేసిన మ్యాజిక్‌ చాలా చోట్ల కన్వీన్సింగ్‌ అనిపించదు.  కథాగమనం  నిదానంగా సాగుతుంది.  సైంటిఫిక్‌ ఎపిసోడ్‌తో పాటు రెట్రో కథ మొత్తం సాగదీసిన అనుభూతి కలుగుతుంది. చూపించిన సన్నివేశాల్నే మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తూ కాలక్షేపం చేశారు.  రెండు ప్రేమకథల్లో ఆసక్తి లోపించింది. కథానాయికలు కేవలం అతిథి పాత్రలుగానే కనిపిస్తారు. హీరో, విలన్‌  పోరాటంలో బలం లోపించింది.  సైన్స్‌ ఎపిసోడ్స్‌ గందరగోళానికి గురిచేస్తాయి. రవితేజ వన్‌మెన్‌ షో ఇది.  డిస్కోరాజా, వాసుగా రెండు పాత్రల వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎనర్జీతో కూడిన నటనను కనబరిచారు.  ముఖ్యంగా డిస్కోరాజాగా అతడి లుక్‌, మేజరిజమ్స్‌ ఆకట్టుకుంటాయి.  1970 కాలంనాటి వస్త్రధారణలో  కనిపిస్తూ అతడు చేసే సందడి, కామెడీ టైమింగ్‌ ఆహ్లాదాన్ని పంచుతాయి. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు దొరికిన ఈ అవకాశాన్ని రవితేజ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.  పాయల్‌రాజ్‌పుత్‌,  నభానటేష్‌ గ్లామర్‌తో అలరించారు. నటనను ప్రదర్శించడానికి వారికి అవకాశం దక్కలేదు. కమెడియన్‌ సునీల్‌లోని విలనిజాన్ని చూపించిన సినిమా ఇది. పతాక ఘట్టాల్లో అతడి వేరియేషన్స్‌ ఆకట్టుకుంటాయి. సత్య, నరేష్‌, రాంకీలపై తెరకెక్కించిన కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కవుట్‌ అయ్యింది. ప్రతినాయకుడి పాత్రలో బాబీసింహా ఒదిగిపోయారు.  తమన్‌ స్వరపరచిన గీతాల్లో ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన నువ్వు నాతో ఏమంటావో పాట చక్కటి సాహిత్యపు విలువలతో శ్రావ్యంగా ఉంది. కార్తిక్‌ ఘట్టమనేని ఛాయాగ్రహణం  ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  1970 నాటి కాలంతో పాటు ఐస్‌లాండ్‌ ఎపిసోడ్‌  కలర్‌ఫుల్‌గా ఉంటుంది.  నలభై ఏళ్ల క్రితం నాటి కాలాన్ని కళా దర్శకుడు అద్భుతంగా పునఃసృష్టించారు.

రవితేజ అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరిచే సినిమా ఇది.  కొత్తదనంతో కూడిన సినిమా ఇదంటూ ప్రచార వేడుకల్లో చిత్రబృందం చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా పూర్తిగా రొటీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కిన సినిమా ఇది.
రేటింగ్‌:2.5/5


logo