గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 03, 2020 , 22:47:10

పక్కన పడ్డాది చూడరో పిల్లా..

పక్కన పడ్డాది చూడరో పిల్లా..

‘ఈ చిత్ర దర్శకుడు కరుణకుమార్‌ నాకు రచయితగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన కథలు కొన్ని చదివాను. బాగుంటాయి. డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారుచేసుకొని ఈ సినిమా చేశాడు’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. సుధా మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా నటించారు. కరుణకుమార్‌ దర్శకుడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. జీఏ2, యు.వి.క్రియేషన్స్‌ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ఈ సినిమాలోని ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను ఇటీవల సుకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘1978లో పలాసలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పల్లెటూరి సంస్కృతిని తెరపై ఆవిష్కరించే దర్శకులు తెలుగులో తక్కువ మంది ఉన్నారు. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. ఉత్తరాంధ్ర జానపదం చాలా ప్రఖ్యాతి పొందింది. మా కాలేజీ రోజుల్లో ఆ పాటలే పాడుకునేవాళ్లం’ అన్నారు. రఘు కుంచె, తిరువీర్‌, జనార్థన్‌, లక్ష్మణ్‌, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరుల్‌ విన్సెంట్‌, సంగీతం: రఘు కుంచె, రచన-దర్శకత్వం: కరుణ కుమార్‌.

logo