‘సమాజానికి ఉపయుక్తమైన చిత్రమిది. పవన్‌కల్యాణ్ వల్లే సినిమాలో చూపించిన సందేశం కోట్లాదిమందికి చేరువ అవుతోంది’ అని చెప్పింది అంజలి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. పవన్‌కల్యాణ్ హీరోగా నటించారు. శ్రీరామ్‌వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో ‘మగువా ఇది నీ విజయం’ పేరుతో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌కు నేను వీరాభిమానిని. ఇప్పటివరకు ఆయన్ని ఒకేసారి కలిశా. ఎంతో మర్యాద ఇచ్చారు. ఈ సినిమా ద్వారా మహిళల్ని గౌరవించేలా చాలా మందిలో ఆయన స్ఫూర్తిని నింపారు. ఇలాంటి కథాంశంతో సినిమా రావడం అరుదు’ అని తెలిపింది. దర్శకుడు శ్రీరామ్‌వేణు మాట్లాడుతూ ‘దర్శకుడిగా ఈ విజయం ఎంతో సంతృప్తినిస్తోంది. మహిళ ప్రేక్షకులకు ఈ సినిమా చేరువ కావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. మహిళల శక్తిని చాటిచెప్పిన చిత్రమిదని న్యాయమూర్తి ఉదయగౌరి పేర్కొన్నారు.