e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఇంట‌ర్వ్యూ Director Krish | వారితోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యం

Director Krish | వారితోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యం

‘ప్రతి రోజు మనం ఓ సంఘర్షణ నుంచి మరో సంఘర్షణలోకి ప్రయాణం చేస్తుంటాం. ఈ క్రమంలో నైతికైస్థెర్యాన్ని మనమే ప్రోదిచేసుకోవాలి. గెలుపుకోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎవరికి వారు స్వీయ జీవితాన్వేషణ చేసుకొని ఉన్నతంగా పరివర్తన చెందాలి’ అనే తాత్విక భూమికపై ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని అన్నారు అగ్ర దర్శకుడు క్రిష్‌. ఆయన నిర్దేశకత్వంలో వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండ పొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు క్రిష్‌ పాత్రికేయులతో సంభాషించారు. ఆ విశేషాలివి..

ఈ నవలను దృశ్యమానం చేసే విషయంలో సృజనాత్మకంగా మీరు ఎలాంటి స్వేచ్ఛను తీసుకున్నారు?
నవలా ప్రక్రియ, సినిమా మాధ్యమం రెండూ పూర్తి భిన్నమైనవి. నవలా రచయితకు ఓ ఖచ్చితమైన పరిధి అంటూ ఏమీ ఉండదు. అనంతమైన ఆలోచనల్ని అక్షరాల్లో ఆవిష్కరించవొచ్చు. సినిమాకు హద్దులు ఉంటాయి. నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు ఈ ఇతివృత్తాన్ని అనుక్షణం ఉత్కంఠను పంచే ఘటనలతో సినిమాటిక్‌ శైలిలో రాశారు. అందుకే సంభాషణల రచనతో పాటు నవలను సినిమాగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఆయనే పూర్తి సహకారం అందించారు.

- Advertisement -

ఈ నవలా ఇతివృత్తంలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఎంచుకున్న కథావస్తువు సరికొత్తగా అనిపించింది. వర్షాభావ పరిస్థితుల్లో గొర్రెల కాపరులు వేల జీవాల్ని తోలుకొని అరణ్యంలోకి కొండపొలం వెళ్లడం, అక్కడే కొన్ని నెలలు గడపడం అనే అంశంలో జీవిత తత్వం ఉందని పించింది. ఎక్కడో సుదూరంగా కొండ వాలులో మేస్తున్న గొర్రెలమందను చూస్తే మనకది అందమైన దృశ్యంలా కనిపిస్తుంది కానీ అక్కడ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఒక్కోసారి జీవన్మరణ పరిస్థితులు ఎదురవుతాయి. ‘కొండపొలం’ నవలలోని సాహసం, సంఘర్షణ, జీవితాన్వేషణ అనే అంశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

నవలలో లేని కథానాయిక పాత్రను సినిమాలో ఎందుకు పెట్టాల్సివచ్చింది?
ఏ కథ అయినా కాంతాసమేతంగా చెబితే బాగుంటుందని నేను నమ్ముతాను. ‘గ మ్యం’ సినిమాలో హీరో తనని తాను తెలుసుకునే ప్రయాణాన్ని ప్రేమకథ నేపథ్యంలోనే చూపించాం. అలాగే ‘కొండపొలం’ సినిమాకు కూడా ఓ అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందనిపించింది. నల్లమల ప్రాంతంలో ఓబులమ్మ అనే పేరుకు చాలా ప్రాచుర్యం ఉంది. ఆ కారణంతోనే కథానాయికకు కూడా అదే పేరు పెట్టాం.

ఈ సినిమా ద్వారా ఎలాంటి ఫిలాసఫీని చెప్పబోతున్నారు?
ఆత్మన్యూనతాభావంతో బాధపడే ఓ యువకుడు జీవితాన్ని ఎలా జయించాడు? అతడికి అడవి వేదికగా ఎలా నిలిచిందన్నదే ఈ సినిమా కథలోని ముఖ్యాంశం. వ్యక్తిత్వ వికాసం కోసం మనం ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటాం. వాటన్నింటికంటే మనల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని గమనిస్తే.. వారి జీవిత పయనంలోనే వ్యక్తిత్వ వికాస పాఠాలు కనిపిస్తాయి. నా దృష్టిలో తల్లిదండ్రులకు మించిన వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎవరూ ఉండరు. ఈ సినిమాను ఇదే కోణంలో ఆవిష్కరించాం.

దర్శకుడు సుకుమార్‌ ఈ నవల గురించి మీకు చెప్పారని తెలిసింది?
కొన్ని మాసాల క్రితం జరిగిన డైరెక్టర్స్‌ మీట్‌లో పుస్తకాల ప్రస్తావన వచ్చింది. ఎవరెవరు ఏ బుక్స్‌ చదివారో అడిగి తెలుసుకున్నాం. అప్పుడు సుకుమార్‌, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘కొండపొలం’ పుస్తకం గురించి చెప్పారు. వెంటనే వెళ్లి పుస్తకం చదివాను. బాగా నచ్చింది. అలా ఈ సినిమాకు అంకురార్పణ జరిగింది.

కథాంశాల ఎంపికలో మీరు పెట్టుకున్న ప్రామాణికాలేమిటి?
ప్రతి సినిమాకు నాకో కొత్త కథ కావాలి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె…ఇలా నా సినిమాలన్నీ విభిన్నమైన కాన్వాస్‌ల మీద దర్శనమిస్తాయి. కథలో నవ్యత చాలా ముఖ్యం. అరణ్యం, జంతువుల నేపథ్యంలో ఓ అడ్వెంచరస్‌ సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ‘కొండపొలం’తో కుదిరింది. నేను ఏ కథ చెప్పినా అంతర్లీనంగా అందులో మానవ ఉద్వేగాల్ని, మనిషితనం గురించి తప్పకుండా చర్చిస్తాను.

ఓ వైపు పవన్‌కల్యాణ్‌గారితో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ చేస్తూ ఈ సినిమాను టేకాఫ్‌ చేయడానికి కారణమేమిటి?
పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న ‘హరిహరవీరమల్లు’ షూటింగ్‌ గ్యాప్‌లో ‘కొండపొలం’కథ ఓకే అయింది. సబ్జెక్ట్‌ బాగా నచ్చడంతో కరోనా ప్రతిబంధకాలు ఉన్నా సరే తెరకెక్కించాలనుకున్నా. ఈ సినిమా తీయడానికి ముందుగా పవన్‌కల్యాణ్‌గారి పర్మిషన్‌ తీసుకున్నా. వైష్ణవ్‌తేజ్‌ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. అతనిలో నేర్చుకోవాలనే తపన ఎక్కువగా కనిపించింది.

అడవిలో షూటింగ్‌ అనుభవాల గురించి?
వికారాబాద్‌ అడవుల్లో 45రోజులు షూటింగ్‌ చేశాం. టీమ్‌ మొత్తం అక్కడే ఉన్నాం. వెయ్యి గొర్రెలను షూటింగ్‌ కోసం తీసుకున్నాం. కొండలు, గుట్టలు ఎక్కుతూ షూటింగ్‌ జరపాల్సి వచ్చింది. అదొక గొప్ప అనుభవం. ప్రకృతి మధ్యలో గడపడం వల్ల మా టీమ్‌ అందరి ఆరోగ్యాల్లో సానుకూల మార్పులు కనిపించాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement