గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Mar 01, 2020 , 22:42:15

సార్వజనీన కథ ఇది

సార్వజనీన కథ ఇది

‘గడచిన కొన్నేళ్లుగా గ్రామీణ కళలు, కుల వృత్తులు క్షీణదశకు చేరుకున్నాయి. ఏవో కొన్ని మిగిలి ఉన్నా అభివృద్ధి పేరుతో వాటిని సైతం కాలరాసే ప్రయత్నం జరుగుతోంది. ‘పలాస 1978’ చిత్రంలోఎనభైదశకం నాటి అలాంటి పరిస్థితుల్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించాను’ అని అన్నారు కరుణకుమార్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘పలాస’. రక్షిత్‌ అట్లూరి, నక్షత్ర జంటగా నటించారు. ఈ నెల 6న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణకుమార్‌ ఆదివారం  హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.


నాకు కథలు రాయడం అలవాటుగా ఉండేది. స్వచ్ఛభారత్‌ కోసం చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. ఆ తర్వాత కేటీఆర్‌గారి ప్రోత్సాహంతో ప్రభుత్వ యాడ్స్‌ రూపొందించాను. నేను పుట్టిపెరిగిందంతా శ్రీకాకుళం జిల్లా పలాసలోనే. దాంతో అక్కడి ప్రజల జీవన స్థితిగతులపై సంపూర్ణమైన అవగాహన ఉంది. 1978లో పలాసలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. నాటి భూస్వామ్య, ఆధిపత్య శక్తుల ప్రభావం ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. సార్వజనీన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుంది. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధితో ఉండేవి. అక్కడి ప్రజలు సంతృప్తిగా జీవితం సాగించేవారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. వాటి గురించి ఈ సినిమాలో చర్చించాం. ఒక వ్యక్తి, కుటుంబ కథ కాదిది. సమూహానికి చెందినది.


అందుకే కొత్త వాళ్లతో..

ఈ సినిమా కాన్సెప్ట్‌లో బలమైన ఉద్వేగాలున్నాయి. విస్త్రత పరిధి వున్న కథాంశమిది. అందుకే కొత్తవాళ్తైతేనే ఇమేజ్‌లకు దూరంగా న్యాయం చేయగలరనిపించింది. గత 25ఏళ్లలో తెలుగు చిత్రసీమలో ఈ తరహా ఇతివృత్తంతో సినిమా రాలేదని నమ్మకంగా చెబుతున్నా. ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖలు  సినిమా చూసి బాగుందని మెచ్చుకోవడం సంతృప్తినిచ్చింది.


logo