e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home సినిమా Republic Movie | నా అజ్ఞానం నుంచే ఈ కథ పుట్టింది!

Republic Movie | నా అజ్ఞానం నుంచే ఈ కథ పుట్టింది!

‘ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ తన మనసులో ఉన్నది దాచుకోకుండా, భయం లేకుండా మాట్లాడారు. అయితే ఏపీ ప్రభుత్వం గురించి పవన్‌ మాట్లాడిన మాటలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. మా సినిమాకు ఆ రాజకీయ అంశాలతో సంబంధం లేదు’ అని అన్నారు దేవా కట్టా. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్‌’. సాయితేజ్‌ హీరోగా నటించారు. అక్టోబర్‌ 1న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దేవాకట్టా పాత్రికేయలతో పంచుకున్న ముచ్చట్లివి…

‘రిపబ్లిక్‌’ కథను రాయడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలేవి?
రాజకీయాంశాలు, వ్యవస్థ పట్ల నా అవగాహనలేమి, అజ్ఞానం నుంచే ఈ కథకు బీజం పడింది. ప్రభుత్వం, ప్రజాస్వామంతో పాటు క్యాపిటలిజం, కమ్యూనిజం, సోషలిజం లాంటి మాటల్ని నిజజీవితంలో చాలా సార్లు వింటుంటాం. చదువుకున్న నాకే ఆ అంశాల గురించి అవగాహన లేనప్పుడు సామాన్యుడు వాటిని ఎలా అర్థం చేసుకోగలడనే పాయింట్‌నుంచి స్ఫూర్తి పొంది కథను రాయడం మొదలుపెట్టా. ప్రభుత్వం, ప్రజాస్వామం ఉందనే భ్రమలో బతుకుతున్నాం. కానీ అవేలా ఉంటాయో, పనిచేస్తాయో సామాన్యులకు తెలియదని చాటిచెప్పే చిత్రమిది. అపరిమితమైన అధికారాలు మనిషిని, పార్టీలను ఎలా అవినీతిపరులుగా మారుస్తాయో చూపించాం. అధికారం అనేది క్రమబద్ధంగా, పరిమితులతో కూడి ఉండాలనే సందేశాన్ని అందించాం.

- Advertisement -

రాజకీయాల్లోని లోతుపాతులను కమర్షియల్‌ పంథాలో చెప్పడం ఛాలెంజ్‌గా అనిపించిందా?
న్యాయ, శాసన, అధికార వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛగా పనిచేసినప్పుడే వ్యవస్థ సరైన దారిలో నడుస్తుందనే అంశాన్ని సినిమాలో ఆవిష్కరించాను. నాయకులు విలువలు తప్పితే జరిగే పరిణామాలను చూపించాను. అంతేకానీ పార్టీలను , మనుషుల్ని ఉద్ధేశించి సినిమా తీయలేదు. ప్రభుత్వ అధికారులపై రాజకీయపరంగా ఉండే ఒత్తిళ్లను అర్థవంతంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. పొలిటికల్‌ పవర్‌ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అది తప్పని చాటే సినిమా ఇది.

సాయితేజ్‌ను హీరోగా తీసుకోవడానికి కారణమేమిటి? అతడి పాత్ర ఎలా ఉంటుంది?
నాయకులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండే కలెక్టర్‌గా సాయితేజ్‌ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ప్రజల్లో మార్పు తీసుకురావాలని తపించే నిజాయితీపరుడైన ఆ కలెక్టర్‌ ప్రయాణం ఎలా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కామన్‌మ్యాన్‌ కోణంలో సాయితేజ్‌ ఈ కథకు కనెక్ట్‌ అయ్యారు. తనతోనే ఈ సినిమా చేయాలని నాతో ప్రామిస్‌ చేయించుకున్నారు. నటుడిగా అతడికి కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. నా విజన్‌ను నమ్మి సినిమా చేశారు. నాకో సైనికుడిగా అండగా నిలిచారు.

‘ప్రస్థానం’ తర్వాత మీరు చేసిన సినిమాలేవి సరైన విజయాల్ని సాధించలేదు? ఆ సినిమాల విషయంలో ఎక్కడ తప్పు జరిగిందని అనుకుంటున్నారు?
‘వెన్నెల’, ‘ప్రస్థానం’ సినిమాలు చేస్తున్నప్పుడు నిర్మాణ పరంగా పరిమితులు ఉన్నా సృజనాత్మకంగా నాకు చాలా స్వేచ్ఛ ఉండేది. నా ఆలోచనలకు అనుగుణంగా ఆ సినిమాల్ని తెరకెక్కించాను. ఆ తర్వాత ఇమేజ్‌ పరమైన లెక్కలు, కామెడీ ట్రాక్‌లు, కమర్షియల్‌ హంగుల పేరుతో ఇతరుల ప్రభావంతో కొన్ని చెత్త సినిమాలు చేశాను. వాటిని ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ సినిమాను మాత్రం పూర్తి స్వేచ్ఛగా తెరకెక్కించాను. దర్శకుడిగా నాకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకముంది.

కెరీర్‌ పరంగా చేసిన తప్పుల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
‘ప్రస్థానం’ సినిమా నా ప్రతిభను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత చేసిన సినిమాలు ఇండస్ట్రీని నాకు పరిచయం చేశాయి. కృషి, తపన ఉంటే విజయాల్ని అందుకోవచ్చని అనుకున్నా. కానీ చుట్టుపక్కల ఉండే పరిస్థితులు కూడా సినిమాల్ని ప్రభావితం చేయగలవని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ‘ఆటోనగర్‌ సూర్య’తో ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది. ఆ తర్వాత చాలా కథలు రాసుకున్నా. చివరి నిమిషంలో హీరోలు తప్పుకున్నారు. అర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ‘ డైనమెట్‌’ సినిమా చేశాను. తొమ్మిది రోజులు మాత్రమే నేను ఆ సినిమాకు పనిచేశా. కానీ పరాజయం మాత్రం నా ఖాతాలో పడింది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆ సినిమాతో తెలుసుకున్నా. ఆ తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతో నా ఆలోచనలకు మాత్రమే కట్టుబడి నిజాయితీగా ఈ సినిమా చేశా.

తదుపరి సినిమా విశేషాలేమిటి?
చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మధ్య ఉన్న స్నేహాన్ని, వారి జీవితాల్ని ఆవిష్కరిస్తూ ‘ఇంద్రప్రస్థం’ పేరుతో ఓ కథ రాసుకున్నా. మూడు భాగాల సిరీస్‌గా దీనిని రూపొందించబోతున్నాం. ‘బాహుబలి ది బిగినింగ్‌’ సిరీస్‌ను అంగీకరించాను. కానీ మా కెరీర్‌ను మొత్తం వెచ్చించి తెరకెక్కించాల్సిన సిరీస్‌ ఇది. అందుకు ఎంతో ఎఫర్ట్‌ పెడితేనే న్యాయం చేయగలమని అనిపించింది. సమయం లేక సిరీస్‌ నుంచి తప్పుకున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement