అగ్రహీరో కల్యాణ్‌రామ్ జోరుమీదున్నారు. సోమవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకేసారి ఐదు సినిమాల్ని ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. గత కొన్నేళ్లుగా ప్రయోగాత్మక, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లకు పెద్దపీట వేస్తున్న కల్యాణ్‌రామ్ తాజా చిత్రాల ఎంపికలో కూడా తన అభిరుచిని కనబరిచారు. విభిన్న జోనర్స్లో ఈ ఐదు సినిమాలు తెరకెక్కబోతున్నాయి.
బ్రిటీష్ గూఢచారి
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘డెవిల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ఉపశీర్షిక. అభిషేక్ నామా నిర్మాత. సోమవారం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో పంచె, కోటు ధరించి 1945 కాలం నాటి వ్యక్తిగా కల్యాణ్‌రామ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘1945 బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రహస్య గూఢచారిగా కల్యాణ్‌రామ్ కనిపిస్తారు. ప్రేమ, మోసం, ద్రోహం అనే వలయాలను ఎదురించి అతడు సాగించిన పోరాటం ఉత్కంఠను పంచుతుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందించనున్నాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ: శ్రీకాంత్ విస్సా.
మైత్రీ మూవీస్‌లో
మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థలో కల్యాణ్‌రామ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
గుహన్‌తో మరోసారి
‘118’ అనంతరం కల్యాణ్‌రామ్, దర్శకుడు కేవీ గుహన్ కలయికలో మరో సినిమా రాబోతున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నది. ఈ చిత్రానికి ‘ఏజెంట్ వినోద్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
‘బింబిసార’ కొత్త లుక్
కల్యాణ్‌రామ్ హీరోగా పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘బింబిసార’. వశిష్ట్ దర్శకుడు. సోమవారం కల్యాణ్‌రామ్ కొత్త లుక్‌ను విడుదలచేశారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. కేథరీన్, సంయుక్తమీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌లో
కల్యాణ్‌రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందబోతున్నది. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.