హిందూ వ్యతిరేక ప్రమాణం నాది కాదు
బౌద్ధ కుటుంబం చేయించిన బుద్ధవందనం అది
గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): స్వేరో నెట్‌వర్క్‌లో అన్ని మతాలవారున్నారని, తాము అన్ని పండుగలను సమానంగా జరుపుకుంటామని ఐపీఎస్ అధికారి, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. స్వేరో పవిత్రమాసం కార్యక్రమ ప్రారంభంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధూళికట్ట గ్రామంలోని బౌద్ధక్షేత్రంలో పాలరాతి బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆ సంస్థ సభ్యుడొకరు.. అక్కడున్నవారందరిచేత హిందూ దేవుళ్లను పూజించవద్దంటూ ప్రతిజ్ఞ చేయించినట్టు వైరల్ అయిన వీడియో వివాదాస్పదం కావడంతో ప్రవీణ్‌కుమార్ స్పందించారు.
ఈ వివాదంపై విచారం వ్యక్తంచేస్తూ ప్రకటన విడుదలచేశారు. ధూళికట్ట గ్రామంలో బుద్దుడి విగ్రహఏర్పాటు కార్యక్రమంలో ఒక బౌద్ధ కుటుంబం బుద్ధ వందనాన్ని, అంబేద్కర్ బౌద్ధధర్మాన్ని స్వీకరించినప్పుడు చేసిన ప్రమాణాన్ని చదువగా అందరూ చదివారని.. దీనిపై అక్కడికక్కడే.. వేదికపైనే వివరణ ఇచ్చామని చెప్పారు. దీనివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తాను విచారం వ్యక్తంచేస్తున్నానన్నారు. సంబంధిత బౌద్ధ కుటుంబంతో తనకు గాని స్వేరోస్ కుటుంబసభ్యులకు గాని ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. హిందూదేవతామూర్తులను పూజించవద్దంటూ ప్రతిజ్ఞచేయడం సరికాదని టీఆర్ఎస్ పార్టీనేత నల్ల మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు.