శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 18:06:34

మూడేళ్ల వ‌య‌స్సులోనే వేధింపుల‌కు గుర‌య్యా : ద‌ంగ‌ల్ న‌టి

మూడేళ్ల వ‌య‌స్సులోనే వేధింపుల‌కు గుర‌య్యా : ద‌ంగ‌ల్ న‌టి

ఢిల్లీ : అమీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా 'దంగల్' లో నటించిన తరువాత ఈ మూవీ పేరు న‌టి ఫాతిమా సనా షేక్ కు ఇంటి పేరుగా మారింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇందులో ఆమె రెజ్ల‌ర్‌ గీతా ఫోగట్ పాత్రను పోషించారు. ఈ నటి చిన్న వయస్సు నుండే సినిమాల్లో నటిస్తోంది. భామనే సత్యభమనే, వన్ 2 కా 4 వంటి చిత్రాలలో బాల‌న‌టిగా క‌నిపించింది. తాజాగా పింక్‌విల్లా.కామ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫాతిమా స‌నా షేక్ తన జీవితంలో చోటుచేసుకున్న‌ భయంకరమైన లైంగిక వేధింపుల అనుభవాన్ని పంచుకున్నారు. త‌న‌కు మూడేళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడే లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు తెలిపింది. లైంగిక వేధింపుల స‌మ‌స్య చుట్టూ ఒక క‌ళంకం ఉంద‌న్నారు. అందుకే మ‌హిళ‌లెవ‌రూ కూడా త‌మ జీవితాల్లో చోటుచేసుకున్న లైంగిక దాడుల గురించి నోరుతెర‌వ‌న్నారు. 

కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచం మారుతున్న‌ట్లు తాను ఆశిస్తున్నాన‌న్నారు. దీనిపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  ప్ర‌జ‌లు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తార‌నుకుంటున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డ్డారు. వాస్త‌వానికి తాను కాస్టింగ్ కౌచ్‌ను సైతం ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు. ఉద్యోగం ల‌భించే ఏకైక మార్గం సెక్స్‌కు అంగీక‌రించ‌డం మాత్ర‌మే అని చెప్ప‌బ‌డిన ప‌రిస్థితులు ఉన్నాయ‌న్నారు. ప‌ని నుండి తీసేసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌న్నారు. ఫాతిమా ప్ర‌స్తుతం లుడో, సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ మూవీల్లో న‌టిస్తోంది.