ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 00:15:34

రోజూ గిల్లేవాడు ఆర్జీవీ

రోజూ గిల్లేవాడు ఆర్జీవీ

‘అర్థంలేని భావజాలంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఓ వ్యక్తితో కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. అతడి వల్ల కొందరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఏ విధంగా అతడిపై ప్రతీకారం తీర్చుకున్నారనేది ఈ చిత్ర ఇతివృత్తం’ అని అన్నారు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం. మాగ్నస్‌ సినీ ప్రైమ్‌ పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘రోజూ గిల్లేవాడు’.  ‘ఆర్జీవీ’ ఉపశీర్షిక. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 

సెటైరికల్‌ కామెడీ చిత్రమిది. స్వేచ్ఛ పేరుతో  ఇష్టానుసారం మాట్లాడటం వల్ల జరిగే అనర్థాలేమిటి?  నిరూపయోగమైన భావజాలం ఉన్న వ్యక్తుల వల్ల సమాజానికి ఎలాంటి చెడు జరుగుతుందో సినిమాలో చూపించబోతున్నాం. వినోదమే ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమాలో ఎవరిని విమర్శించడం, తప్పుగా చూపించడం లేదు. ఆర్జీవీపై సినిమా  తీసి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన లేదు.  ఆర్జీవీలోని కామెడీ టైమింగ్‌ను వ్యంగ్యంగా ఆవిష్కరిస్తూ జొన్నవిత్తుల చక్కటి కథ  రాశారు.  ఆర్జీవీనీ  అనుకరించే,  ఆయన పోలికలతో ఉండే పాత్రలేవీ కనిపించకుండా విభిన్నంగా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేస్తున్నాం.  చక్కటి ఎంటర్‌టైనర్‌గా అందరిని నవ్విస్తుంది. టైటిల్‌ పాత్రలో సీనియర్‌ హీరో సురేష్‌ కనిపిస్తున్నారు. శ్రద్ధాదాస్‌ కీలక పాత్రలో నటిస్తుంది. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణను పునః ప్రారంభిస్తాం. ఇటీవల విడుదల చేసిన ‘వోడ్కా మీద ఒట్టు’ పాట రెండు మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఆదివారం అర్ధరాత్రి ‘దగుల్భాజీ దర్శకదయ్యం’ అనే మరో పాటను విడుదలచేయబోతున్నాం. ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం.  అప్పటికీ  థియేటర్లు తెరచుకోని పక్షంలో ఓటీటీలో విడుదలచేస్తాం. తొలుత ఈ సినిమా కోసం చాలా టైటిల్స్‌ అనుకున్నాం.  రోజూ గిల్లేవాడు  ఆర్జీవీ క్యాచీగా ఉండటంతో అదే ఖరారు చేశాం. టైటిల్‌ ఆలోచన నాదే. 

రాజశేఖర్‌తో ఓ సినిమా

జొన్నవిత్తుల దర్శకత్వంలో  వచ్చిన ‘పెళ్లాం పిచ్చోడు’  ద్వారా  నా సినీ ప్రయాణం ఆరంభమైంది. ఆ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాను. ఆ తర్వాత నేను నిర్మించిన ‘కార్తికేయ’ పెద్ద విజయాన్ని సాధించింది. కథలో రాజకుమారి, సుబ్రమణ్యపురం చిత్రాల్ని నిర్మించారు. ‘సుబ్రమణ్యపురం’ చిత్రానికి కథను అందించాను. నాకున్న రచనా పరిజ్ఞానంతో కథల  విషయంలో దర్శకుడికి అవసరమైన సలహాలు ఇస్తాను. అంతేకానీ వారి పనిలో  జోక్యం చేసుకోను. దర్శకుడిని అవ్వాలనే ఆలోచన లేదు. హీరో రాజశేఖర్‌తో ఓ సినిమాను నిర్మించబోతున్నాను. మార్చిలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభంకావాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల వాయిదావేశాం.  వచ్చే ఏడాది భక్తి ప్రధాన కథాంశంతో పెద్దసినిమాను నిర్మించే సన్నాహాలు చేస్తున్నాను.  జొన్నవిత్తులు రచయితగా పనిచేస్తున్న ఈ చిత్రానికి  అగ్ర దర్శకుడు నిర్దేశక బాధ్యతల్ని చేపట్టనున్నారు.logo