లక్నో : స్కూల్ లో పాఠాలు నేర్చుకుంటూ పిల్లలతో ఆనందంగా గడపాల్సిన పదేండ్ల బాలుడితో స్వయానా తండ్రి, మామ కలిసి అక్రమ మద్యం అమ్మిస్తున్న ఉదంతం యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వెలుగుచూసింది. కస్టమర్లకు బాలుడు మద్యం అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కలకలం రేపింది. దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని కాపాడారు. అక్రమ మద్యం అమ్మించేందుకు బాలుడిని బలవంతంగా స్కూల్ మాన్పించారు.
ఓ కిరాణా దుకాణంలో బాలుడిచే అక్రమ మద్యం విక్రయం సాగిస్తుండగా పోలీసులు మైనర్ బాలుడిని కాపాడారు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా క్రిపకుంద్ గ్రామంలో తమ కిరాణా దుకాణం నుంచి బాలుడి తల్లితండ్రులు అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తున్నట్టు వెల్లడైంది. దుకాణంపై పోలీసులు దాడి చేసిన సమయంలో తల్లితండ్రులు కిరాణా షాపులో కూర్చునిఉండగా షాపు వెనుక బార్ తరహాలో ఏర్పాట్లు చేసి బాలుడు కస్టమర్లకు మద్యం అందిస్తూ కనిపించాడు. బాలుడి తండ్రి, మామను పోలీసులు అదుపులోకి తీసుకుని బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులకు అప్పగించారు. దాడిలో 115 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.