తెలుగు చిత్రసీమకు బాసటగా సీఎం వరాలజల్లు

తెలుగు చిత్రసీమపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కరోనా ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన సినీరంగానికి చేయూతనందించేందుకు పలు నిర్ణయాల్ని ప్రకటించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో టాలీవుడ్‌కు పెద్దపీట వేశారు. లాక్డౌన్ కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడ్డ థియేటర్లను ఎప్పుడైనా పునఃప్రారంభించుకోవచ్చని, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని పరిశ్రమకే ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చిత్రసీమపై ఆధారపడి వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని..దేశంలోనే తెలుగు సినీరంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం తెలిపారు.
సినీ అభిమానులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కరోనా మహమ్మారి కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడిన థియేటర్లను తక్షణమే తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. యాభై శాతం ఆక్యుపెన్సీతో సింగిల్స్క్రీన్ థియేటర్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లను పునఃప్రారంభించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య భద్రతా దృష్ట్యా మేనేజ్మెంట్ పాటించాల్సిన మార్గదర్శకాల్ని జారీచేసింది.
- ఆడిటోరియం ప్రాంగణంలో ప్రేక్షకులు, థియేటర్ స్టాఫ్‌తో పాటు ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి.
- ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌తో పాటు కామన్ ఏరియాల్లో హాండ్ సానిటైజర్స్‌ను అందుబాటులో ఉంచాలి.
- స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే ఆడిటోరియాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలి.
- ఆడిటోరియం లోపల ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. అలాగే తేమశాతం 40-70 మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- విరామ సమయాల్లో ప్రజలు గుమికూడకుండా ఉండేలా షో సమయంలో వ్యత్యాసాన్ని పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం కేసీఆర్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్, సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలను పెంచుకునేందుకు అనుమతి, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు వంటి చర్యలు ఈ కష్ట సమయంలో పరిశ్రమకు..దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్‌గారి నేతృత్వంలో ఆయన విజన్‌కు తగినట్లుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటిస్థానం పొందుతుందన్న పూర్తి విశ్వాసం ఉంది’.
-చిరంజీవి
కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌గారు ప్రకటించిన ఉపశమన చర్యలు సినీరంగానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. పరిశ్రమ శ్రేయస్సును కాంక్షిస్తూ ముఖ్యమంత్రిగారు తీసుకున్న నిర్ణయాల పట్ల మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తునా.
- అక్కినేని నాగార్జున
సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాలు తెలుగు చిత్రసీమలో తిరిగి సాధారణ పరిస్థితుల్ని తీసుకురావడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
- రామ్‌చరణ్
సీఎం కేసీఆర్‌గారు తీసుకున్న నిర్ణయాలు చిత్రసీమకు సరికొత్త జవసత్వాలు అందిస్తాయి. పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతాయి. మీరు అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు కృషిచేస్తాం. చిత్రసీమ పురోభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
-నితిన్
థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి సీఎంగారు అనుమతి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకంతో పాటు చిత్రసీమపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యలతో తిరిగి సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నా.
- వరుణ్‌తేజ్
చాలా సంతోషంగా వుంది. సరైన సమయంలో సినీ పరిశ్రమను ఆదుకోవడం ఆనందంగా వుంది. మరోసారి ముఖ్యమంత్రి గారు తన గొప్పతనాన్ని చాటుకున్నారు. కనీస కరెంట్ చార్జీల రద్దు, జీఎస్టీ రియింబర్స్‌మెంట్స్, మహారాష్ట్ర, కర్నాటక, ఢీల్లీలో వున్న విధంగా టిక్కెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించడం ఎంతో ఉపయోగకరం. దీనివల్ల థియేటర్ ఓనర్లు, పంపిణీదారులు అందరికి మేలు జరుగుతుంది.
-సునీల్ నారంగ్
పంపిణీదారుడు, నిర్మాత
తెలుగు చిత్ర పరిశ్రమ సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి వుంటుంది. నూతనంగా ప్రకటించిన వరాల జల్లు యావత్ సినీపరిశ్రమకు దిశా నిర్దేశం చేసే విధంగా వుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా చూపించి, ఆయా రాష్ర్టాల్లో కూడా అమలుపరిచే విధంగా కృషి చేస్తాం. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున సీఎంకు ఘనసన్మానం చేయనున్నాం.
సి.కల్యాణ్ (నిర్మాతల మండలి అధ్యక్షుడు)
సినీ పరిశ్రమకు సంబంధించి.. తెలుగు సినీ పరిశ్రమకు మేలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరచడం ఆనందంగా వుంది. సినిమా పరిశ్రమపై ఆధారపడి వున్న 40 వేల మంది కార్మికులు ఈ కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ప్రకటించడం హర్షణీయం. కనీస కరెంట్ చార్జీలు తొలగించడం ఎంతో ఉపయోగకరమైనది.ఈ ప్రకటనతో థియేటర్లు పున: ప్రారంభించడానికి ఎగ్జిబిటర్లు సంతోషంగా వున్నారు. 10 కోట్ల పరిమితి గల సినిమాలకు స్టేట్ జీఎస్టీ రీయింబర్స్మెంట్ స్కీమ్ నిర్మాతలకు ఊరట నిచ్చింది. టీఆర్ఎస్ మేనిఫెస్టోతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఎంతో సంతోషంగా వుంది.
-ఎన్.శంకర్, నిర్మాత, దర్శకుడు
కరోనాతో కుదేలైన సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లు హర్షణీయం. చితికిపోయిన చిత్ర పరిశ్రమకు ఆక్సిజన్ అందించారు. ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమకు ఆయన ప్రోత్సాహకాలు ఎంతో స్ఫూర్తిదాయకం. సీఎం గారికి సినీ పరిశ్రమ మొత్తం ఎంతో రుణపడి వుంటుంది. ఆయన తనదైన విజన్‌తో తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రకటనతో నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల ఓనర్లు ఎంతో ఆనందంగా వున్నారు. ముఖ్యంగా కార్మికులకు తెల్ల రేషన్‌కార్డు, హెల్త్‌కార్డులు, కల్యాణ లక్ష్మీలతో పాటు ప్రభుత్వ పథకాలు అన్ని వర్తింపజేయడం వాళ్లల్లో సంతోషాన్ని నింపింది. కేసీఆర్ లాంటి గొప్ప సీఎంను చూడలేదు.
- సుధాకర్ రెడ్డి, నిర్మాత, పంపిణీదారుడు
సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు
సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కరోనా కారణంగా వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఈ విపత్తు కారణంగా రోజువారి జీవితం గడవడమే గగనమైపోయింది. ఈ కార్మికుల్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సినీ పరిశ్రమలోని కార్మికులకు రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయబోతున్నట్లు ప్రకటించింది. భిన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లో స్థిరపడిన కార్మికులకు ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరిగే అవకాశం ఉందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు ఛార్జీల మినహాయింపు
కరోనా కారణంగా కుదేలైన థియేటర్లకు మళ్లీ ఊతమిచ్చేందుకు మినిమం విద్యుత్తు ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మినిమం ఛార్జీల రద్దుతో నష్టాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం తక్షణ అనుమతులు మంజూరు చేసింది. థియేటర్లు మూత పడటంతో సినిమాల్ని విడుదల చేయలేని పరిస్థితులు తలెత్తడంతో నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. చాలా సినిమాలు నిర్మాణం పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల పునఃప్రారంభంతో ఇండస్ట్రీ సాధారణ స్థితికి వస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పదికోట్లలోపు సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్
చిన్న సినిమాల్ని ఆదుకోవాలనే సంకల్పంతో జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సినిమాలకు సంబంధించి ప్రస్తుతం 18శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఇందులో తొమ్మిది శాతం కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీని రీయింబర్స్మెంట్ చేస్తారు. పదికోట్ల లోపు వ్యయంతో నిర్మించే సినిమాలకు ఈ రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.
మల్టీపుల్ షోస్‌కు అనుమతి
మల్టీప్లెక్స్, సింగిల్స్క్రీన్ థియేటర్లలో మల్టీపుల్ షోస్ వేసుకోవడానికి అవకాశాల్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మల్టీపుల్ షోస్ వేసుకోవడం వల్ల థియేటర్ యాజమాన్యా లతో పాటు నిర్మాతలకు మేలు జరిగే అవకాశముంది. సినిమా వసూళ్లలో ఓపెనింగ్ కలెక్షన్స్ కీలక భూమిక పోషిస్తాయి. ఎక్కువ ప్రదర్శనలకు అనుమతి వల్ల ఓపెనింగ్స్ వసూళ్లు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ వ్యవధిలోనే ఎగ్జిబిటర్లు లాభాల బాట పట్టే అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందే పెద్ద సినిమాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే టిక్కెట్ రేట్లను సవరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకే ఇచ్చింది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో టిక్కెట్ రేట్లను పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యాలే నిర్ణయిస్తుంటాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే టిక్కెట్ల రేట్లను నిర్ణయిస్తుంది. తాజాగా ప్రభుత్వం ఆ వెసులుబాటును యాజమాన్యాలకు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే సింగిల్స్క్రీన్స్లో టికెట్ల రేట్లు తక్కువగానే ఉన్నాయి. టికెట్ రేట్ల సవరణ వల్ల నష్టాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు లాభాల బాట పట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు
- పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక
- ఆండర్సన్ అరుదైన రికార్డు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్‌కు టీకాలు.. భారత్‌ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్‌వో