శనివారం 30 మే 2020
Cinema - Mar 28, 2020 , 17:29:45

లాక్ డౌన్‌: నెటిజ‌న్స్‌కి వినోదాన్ని పంచుతున్న చిరు, మోహ‌న్ బాబు

 లాక్ డౌన్‌:  నెటిజ‌న్స్‌కి వినోదాన్ని పంచుతున్న చిరు, మోహ‌న్ బాబు

లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం, సినిమా షూటింగ్స్ ర‌ద్దు కావడంతో సినీ ప్రియుల‌కి వినోదం అంద‌కుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అభిమానుల‌కి త‌న ట్వీట్స్ ద్వారా కావ‌ల్సినంత ఆనందాన్ని పంచుతున్నాడు. ముఖ్యంగా మోహ‌న్ బాబు, చిరంజీవి మ‌ధ్య సాగుతున్న ఫ‌న్నీ క‌న్వ‌ర్జేష‌న్‌ని సినీ ప్రియులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.ఇద్దరూ నేనంటే నేనంటూ పోటీ పడుతూ పోస్టులు పెడుతున్నారు. 

 ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన  చిరుకు ప్రముఖ సినీ తారలు, దర్శక, నిర్మాతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కూడా మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ రాననుకున్నావా, రాలేననుకున్నావా అని మోహన్ బాబుకు రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు .. ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అని అన్నారు. దీంతో ఆ ట్వీట్‌కు చిరంజీవి కౌంటర్ ఇస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు. న‌మ‌స్తే పెట్టాలి. సామాజిక దూరం పాటించాల‌ని అన్నారు.

చిరు ట్వీట్‌పై తాజాగా స్పందించిన మోహ‌న్ బాబు..‘ మిత్రమా మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం’ అంటూ అదిరిపోయే పంచ్ డైలాగ్ వేశారు. దీనిపై చిరు ఎలా స్పందిస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. మొత్తానికి ఒక‌ప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఉండే చిరు, మోహ‌న్ బాబు ఇప్పుడు ఎంతో ప్రేమ‌గా మాట్లాడుకుండ‌డం అటు మంచు అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్నిస్తుంది.  


logo