శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 12, 2020 , 22:58:23

కఠినం కాదు కారుణ్య హృదయం

కఠినం కాదు కారుణ్య హృదయం

‘అంగవైకల్యంతో మతిస్థిమితంలేని అనాథ మహిళకు ఓ పోలీస్‌ అధికారిణి  ఆప్యాయంగా అన్నంముద్దను కలిపి తినిపిస్తున్న దృశ్యం నా హృదయాన్ని  కదిలించింది’ అంటూ మాతృదినోత్సవం రోజున చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు.  ఆ తల్లి గురించి మీ అందరితో మాట్లాడుతానని ఆయన తెలిపారు. అనాథను ఆదరించిన ఒడిశాకు చెందిన  పోలీస్‌ అధికారిణి శుభశ్రీతో వీడియో కాల్‌ ద్వారా ముచ్చటించారు చిరంజీవి. ఆ సంభాషణను మంగళవారం ట్విట్టర్‌ ద్వారా షేర్‌చేశారు. శుభశ్రీ మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి.   ‘మతిస్థిమితం లేని మహిళకు భోజనం తినిపిస్తున్న దృశ్యం నా  మనసును తాకింది.  నన్ను చలింపజేసింది. ఒక మనిషి మరో మనిషిని ముట్టుకోవాలంటే భయపడే ఈ రోజుల్లో  ఆ అభాగ్యురాలిని అక్కున చేర్చుకొని ఆమె ఆకలి తీర్చారు.  పోలీస్‌లో మానవత్వం, మాతృత్వం చూశాను. పోలీసులకు హృదయం ఉంటుంది అది కఠినంగా కాదు కారుణ్యంతో నిండి ఉంటుందని తెలియజెప్పారు. ఆమె పట్ల ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. మీలో ఒక సానుభూతితో నిండిన తల్లి హృదయం చూశాను. ఎంతో మందికి స్ఫూర్తినిచ్ఛారు’ అని శుభశ్రీని చిరంజీవి అభినందించారు. చిరంజీవి అభినందనల పట్ల శుభశ్రీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. బాధ్యతను నిర్వర్తించడం అంటే లా అండ్‌ ఆర్డర్‌ ఒక్కటే కాదని, పౌరులకు ఎలాంటి అవసరమొచ్చినా సహాయపడటమే మన కర్తవ్యమని ఆమె తెలిపింది. logo