సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 05, 2020 , 14:55:59

బాలయ్యబాబు వ్యాఖ్యలతో చిరంజీవి హర్టయ్యాడట!

బాలయ్యబాబు వ్యాఖ్యలతో చిరంజీవి హర్టయ్యాడట!

హైదరాబాద్‌: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వారే పెద్దవారుగా భావిస్తుండటం సహజం. కొన్నేండ్లుగా రెండు, మూడు కుటుంబాలకు చెందిన వారిదే తెలుగు చిత్రపరిశ్రమలో ఆధిపత్యంగా ఉండేది. కఠోరదీక్ష, శ్రమను నమ్ముకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా మారారు చిరంజీవి. ఇండస్ట్రీలో తనకంటూ బ్యాక్‌బోన్‌ ఎవరూ లేనప్పటికీ కష్టాన్నే నమ్ముకొని అత్యున్నత స్థాయికి చేరుకొన్నారాయన. తెలుగు చిత్రపరిశ్రమలో పలువురికి చిరంజీవి పెద్దదిక్కుగా నిలుస్తుండటంతో.. కొందరు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా నేరుగా చిరంజీవిపై వ్యాఖ్యలు వినిపించాయి. అయినప్పటికీ ఏనాడూ నోరెత్తి మాట్లాడలేదు చిరంజీవి. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంభిస్తూ చిత్రపరిశ్రమ యావత్‌ చర్చించుకొనేలా చేయగలిగారు.

కరోనా నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోగా.. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించే వేలాది మంది బతుకులు అగమ్యగోచరంగా తయారైంది. వీరిని ఆదుకొనేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాల్సిన నేపథ్యంలో చిరంజీవి.. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటుచేసి ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్థికంగా సహాయపడేందుకు ముందడుగేశారు. దీని ద్వారా అందిన నిధులతో పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్థిక సహాయం చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్న తరుణంలో సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా మాట్లాడేందుకు మధ్యవర్తి ప్రాతను చిరంజీవి పోషించారు. తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి పలువురు సినిమా పెద్దలు చర్చలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి సినిమా షూటింగ్‌లకు అనుమతించండంటూ చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు విజ్ఞప్తిచేశారు.అయితే, అన్‌లాక్‌-1లో సినిమా షూటింగ్‌లు ప్రారంభం అవుతాయని అందరూ భావిస్తున్న తరుణంలో బాలకృష్ణ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోసారి రచ్చకు దారితీశాయి.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో లాభాలు పొందేందుకే కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను చర్చలకు ఆహ్వానించకపోవడాన్ని జీర్ణించుకోలేని బాలకృష్ణ.. సినిమా పెద్దలపై అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు నిరసన వ్యక్తంచేశారు. బాలయ్యబాబు వ్యాఖ్యలతో నొచ్చుకొన్న చిరంజీవి.. భవిష్యత్‌ ప్రణాళికల పట్ల మౌనంగా ఉండిపోయారు. తదుపరి చర్చల గురించి ముందుకు పోకూడదని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో నిర్మాతలతోగానీ, ఇతర నటులతోగానీ కలువడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగా ఉండటంతో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించాల్సిన ఆచార్య సినిమా షూటింగ్‌పై కూడా ఆసక్తి చూపడంలేదని సమాచారం.


logo