హైదరాబాద్ : లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తెరపై నవ్వు ఉన్నంత కాలం ఈయన కూడా ఉంటాడు. కేవలం హాస్యం మాత్రమే కాదు.. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు తెర తొలితరం హాస్యనటులలో అల్లు రామలింగయ్య కూడా ప్రముఖులు. అలాగే విలనిజంలోనూ ఆయనకు ఆయనే సాటి. నవ్వుల రేడుగా.. విలక్షణ పాత్రలకు స్పూర్తిగా నిలిచిన అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా నివాళులు అర్పించారు. జులై 31, 2004న ఈయన కన్నుమూసారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి, ఆయన మనవడు అల్లు అర్జున్ నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు.
చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవిత సత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి. ఒక డాక్టర్‌గా,యాక్టర్‌గా, ఫిలాసఫర్‌గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ’.. అంటూ చిరంజీవి నివాళులు అర్పించారు.
అలాగే తాత గురించి అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘కష్టపడే రైతు, లెజెండరీ నటుడు, ఒక మనసున్న వ్యక్తి అయిన తాత అల్లు రామలింగయ్య గారి వర్ధంతి ఈ రోజు.. సినిమాలపై అయనకున్న అభిరుచి, ఆయన జీవిత ప్రయాణం మాలో చాలా మందికి స్ఫూర్తిదాయకం. మన హృదయాలలో ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటారని పేర్కొన్నారు.