శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 12:51:53

సేతుప‌తి కూతురికి బెదిరింపు.. ట్విట్ట‌ర్ యూజ‌ర్‌పై కేసు న‌మోదు

సేతుప‌తి కూతురికి బెదిరింపు.. ట్విట్ట‌ర్ యూజ‌ర్‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్: శ్రీలంక స్పిన్ బౌల‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత క‌థ ఆధారంగా త‌మిళంలో 800 మూవీ తీస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ సినిమాలో న‌టించాల‌నుకున్న హీరో విజ‌య్ సేతుప‌తికి బెదిరింపులు వ‌చ్చాయి.  దీంతో ఆయ‌న ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగాడు.  అయితే ఆ వివాదంలో ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ హీరో కుమార్తెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. ఈ నేప‌థ్యంలో చెన్నై సైబ‌ర్ క్రైం పోలీసులు ఆ ట్విట్ట‌ర్ యూజ‌ర్‌పై కేసు బుక్ చేశారు.  విజ‌య్ సేతుప‌తి, ఆయ‌న కుమార్తె ఫోటోను పోస్టు చేసి బెదిరింపుల‌కు దిగిన వ్య‌క్తిని రితిక్ రాజ్‌గా గుర్తించారు. సెల‌బ్రిటీ ప‌ట్ల ఆన్‌లైన్‌లో అనుచిత కామెంట్లు చేసిన వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ కుమార్ తెలిపారు.  

నిందితుడు రితిక్ రాజ్‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.  ఐపీసీలోని 153(కావాల‌ని రెచ్చ‌గొట్ట‌డం), 294(దుర్భాష‌లాడ‌డం) సెక్ష‌న్లు, ఐటీ యాక్ట్‌లోని 67బీ(చిన్న‌పిల్ల‌ల ఫోటోలతో లైంగిక బెదిరింపులు) సెక్ష‌న్ కింద రితిక్‌పై కేసు బుక్ చేశారు. ఇటీవ‌ల ఐపీఎల్‌లో ఆడుతున్న చెన్నై జ‌ట్టు కెప్టెన్ ధోనికి కూడా బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. స‌రైన రీతిలో ఆడ‌లేక‌పోతున్న ధోనీ ప‌ట్ల ఓ నెటిజ‌న్ అనుచిత కామెంట్ చేశారు. ధోనీ కుమార్తెను రేప్ చేస్తానంటూ ఇన్‌స్టాలో బెదిరించిన ఆ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.  సేతుప‌తిని బెదిరించిన వ్య‌క్తి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని త‌మిళ ప్ర‌ముఖులు డిమాండ్ చేస్తున్నారు.