సాయిరోనక్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ రేపల్లే దర్శకుడు. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర మోషన్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని మధురభావనలకు అద్దం పడుతుంది. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి’ అన్నారు. ‘నేటితరం మెచ్చే అన్ని హంగులున్న ప్రేమకథగా అలరిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నవంబర్ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేస్తాం’ అని నిర్మాత తెలిపారు. మెలోడీ ప్రధానంగా పాటలు సంగీతప్రియుల్ని మెప్పిస్తాయని స్వరకర్త భీమ్స్ పేర్కొన్నారు. మంచి పాటలు రాసే అవకాశం లభించిందని గీత రచయిత సురేష్ గంగుల చెప్పారు.