శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 01:56:30

బాలరాజు ప్రేమాయణం

బాలరాజు ప్రేమాయణం

‘బస్తీ బాలరాజు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌. డబ్బుకు మాత్రమే విలువిస్తాడు. దుఃఖం, చావు మాటలంటే  బాలరాజుకు నచ్చవు. ఆ బాలరాజు  కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’  అంటున్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక. సోమవారం కార్తికేయ జన్మదినం సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదలచేశారు.  ఇందులో శవాల్ని శ్మశానాలకు చేరవేసే అంబులెన్స్‌ డ్రైవర్‌ బస్తీ బాలరాజుగా విభిన్నమైన యాస, గెటప్‌లతో కార్తికేయ కనిపిస్తున్నారు. 

‘నేను రోజు సావులకు బోతా. అందరి ఏడుపు చూసి చూసి..ఏడుపంటేనే చిరాకేస్తుంది..’ అంటూ కార్తికేయ చెప్పిన సంభాషణలు వినోదాన్ని పంచుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదభరిత ప్రేమకథా చిత్రమిది. మా సంస్థలో రూపొందిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వినూత్నమైన పాయింట్‌తో సరికొత్త అనుభూతిని పంచుతుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ నటన, పాత్ర చిత్రణ ఆకట్టుకుంటాయి’ అని తెలిపారు. ఆమని, భద్రం ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి  సినిమాటోగ్రాఫర్‌: సునీల్‌రెడ్డి.