ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 22:46:21

హిందూ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా తాండ‌‌వ్‌?!

హిందూ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా తాండ‌‌వ్‌?!

ముంబై: ‌బాలీవుడ్ న‌టులు సైఫ్ అలీఖాన్‌, డింపుల్ క‌పాడియా త‌దిత‌రులు న‌టించిన వెబ్ సిరీస్ తాండ‌వ్.. ఓటీటీలో ప్ర‌ద‌ర్శించ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అమెజాన్ ప్రైమ్‌ను కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల‌శాఖ కోరిన‌ట్లు స‌మాచారం. తాండవ్ వెబ్ సిరీస్‌కు వ్య‌తిరేకంగా మ‌హారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాం క‌ద‌మ్ ఆదివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెబ్ సిరీస్ క్రియేట‌ర్లు, న‌టులు, డైరెక్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా ఆరోప‌ణ‌లు చేశారు. హిందూ దేవుళ్ల‌ను, దేవ‌త‌ల‌ను కించ‌ప‌రిచారంటూ, ఇది ప్ర‌తీసారి జ‌రుగుతున్న‌దంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచార‌న్నారు. 

ఓటీటీల‌లో సిరీస్‌ల ప్ర‌సారంపై నియంత్ర‌ణ ఉండాలి

వెబ్ సిరీస్‌లో ఈశ్వ‌రుడ్ని ఎగ‌తాళి చేశార‌ని రాం క‌దం మండిప‌డ్డారు. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌పై వెబ్ సిరీస్‌ల ప్ర‌ద‌ర్శ‌న విష‌య‌మై నియంత్ర‌ణ‌కు ఒక సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ను కోరారు. అంత‌కుముందు బీజేపీ ఎంపీ మ‌నోజ్ కోట‌క్ సైతం.. ఓటీటీలో వెబ్ సిరీస్‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ‌నివారం జ‌వ‌దేక‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. 

బ్యాన్ తాండ‌వ్‌.. బాయ్‌కాట్ తాండ‌వ్ హోరు

తాండ‌వ్ వెబ్ సిరీస్‌పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇందులో న‌టించిన సైఫ్ అలీఖాన్ నివాసం వ‌ద్ద ముంబై పోలీసులు భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. సోష‌ల్ మీడియాలో బ్యాన్ తాండ‌వ్‌, బాయ్‌కాట్ తాండ‌వ్ నినాదాల‌తో నిర‌స‌న వెల్లువెత్తుతున్న‌ది. తాండ‌వ్ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్ల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ‌తాళి చేశార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సెక్స్‌, హింస‌, ద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా వెబ్ సిరీస్ ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సిరీస్ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం అవుతున్న‌ది. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంగా ఈ సిరీస్ సాగుతున్న‌ది. హిమాన్షు కిష‌న్ మెహ్రా ఈ వెబ్ సిరీస్ నిర్మాత‌గా ఉన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo