మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 11:14:41

అమితాబ్‌కు చిరు, మ‌హేష్‌, చ‌ర‌ణ్ విషెస్‌

అమితాబ్‌కు చిరు, మ‌హేష్‌, చ‌ర‌ణ్ విషెస్‌

భారతీయ సినిమా దిగ్గజం, ఎంద‌రో న‌టీన‌టుల‌కు ఆద‌ర్శం, ఓ న‌ట శిఖ‌రం అమితాబ్ బచ్చన్. ఇండియ‌న్ సినిమాకి ఆయ‌న ఓ ట్రెండ్ సెట్ట‌ర్. నేడు అమితాబ్ (అక్టోబర్ 11) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు.  ఈ సంద‌ర్బంగా అమితాబ్‌కు ప్ర‌పంచం న‌లు దిక్కుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి చిరంజీవి, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు బిగ్ బీకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

నా ప్రియ‌మైన పెద్ద‌న్న‌, ఇండియ‌న్ సినిమాకు బిగ్ బీ, టాలెంట్ ప‌వ‌ర్ హౌజ్‌, నా మార్గ‌ద‌ర్శ‌కులు వ‌న్ అండ్ ఓన్లీ వ‌న్ అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో అల‌రిస్తున్న మీరు ఇలానే ఉత్తేజ‌ప‌రుస్తూ మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను అని చిరు పేర్కొన్నారు.

హ్యాపీ బ‌ర్త్‌డే అమితాబ్ బ‌చ్చన్ గారు. మీ కార్య‌ద‌క్ష‌త‌తో మాకు, రానున్న త‌రాల‌కు స్పూర్తినిస్తూ ఉండండి అని రామ్ చ‌ర‌ణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీరు నాకే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మిలియ‌న్ల ప్రేక్ష‌కుల‌కు ప్రేర‌ణ‌. మీరు ఎల్ల‌ప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని మ‌హేష్ ట్వీట్ చేశారు.  

చలాకీతనం.. నటనానైపుణ్యాలతో.. ఇప్పటికీ ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తున్న అమితాబ్ బ‌చ్చ‌న్ ఐదు ద‌శాబ్ధాలుగా త‌న సినిమాల‌తో అల‌రిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ పెహ‌న్ షా, మెగాస్టార్‌గా, ఐకానిక్ స్టార్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా ఇలా ఎన్నో బిరుదులు సంపాదించుకున్నారు.  1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో ప్రసిద్ధ కవి హరివంష్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ దంపతులకు జన్మించారు అమితాబ్. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తరువాత ఆయన నటి జయ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కుమార్తె శ్వేతా బచ్చన్ నందా, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. కుమారుడు అభిషేక్ తన తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరిస్తూ నటవారసుడిగా పేరును సంపాదించుకున్నారు.  

అమితాబ్ బచ్చన్ అసలు పేరు ‘ఇంక్విలాబ్’. ఆయ‌న ఇంటి పేరు శ్రీవాస్తవ. తండ్రి కలంపేరైన బచ్చన్‌ను ఇంటిపేరుగా మార్చుకున్నారు. 1971లో వచ్చిన ఆనంద్ మూవీ నుంచి 1988 ‘షెహెన్‌షా’ వరకు యేటా శతదినోత్సవ సినిమా ఇచ్చిన ఏకైక నటుడు బిగ్ బీనే . అమితాబ్ బచ్చన్‌కు ‘జల్సా’, ‘ప్రతీక్ష’ అనే బంగ్లాలున్నాయి. మన దేశం నుంచే కాదు..ఆసియా నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన మొదటి వ్యక్తి అమితాబే కావ‌డం విశేషం. ‘మృత్యుదాత’ మూవీతో బిగ్ బీ ఈయ‌న బిగ్ బీగా మారారు. 

1969లో ‘సాత్ హిందుస్థానీ’ మూవీతో వెండితెరకు పరిచయం అయిన బిగ్ బీ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. త‌న న‌ట‌నా నైపుణ్యంతో అనేక అవార్డులు, రివార్డుల‌తో పాటు ప్ర‌శంస‌లు కూడా పొందారు. ఇప్పటివరకు  ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిలింఫేర్ అవార్డులు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పాటు అనేక పురస్కారాలను కైవసం చేసుకున్న అమితాబ్  భారత ప్రభుత్వం నుండి 1984 లో పద్మశ్రీ, 2001 లో పద్మ భూషణ్, 2015 లో పద్మ విభూషణ్‌ని సొంతం చేసుకున్నారు. వీటితో పాటు 2018 లో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కూడా సత్కరించబ‌డ్డారు ఈ న‌ట దిగ్గ‌జం.

అమితాబ్ బచ్చన్ న‌టించిన వన్ అండ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మూవీ సాత్ హిందుస్తానీ . 1973లో వచ్చిన ‘జంజీర్’ మూవీతో స్టార్‌డమ్ పొందిన అమితాబ్ అంత‌క ముందు 12 ఫ్లాప్స్‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు. బిగ్ బీ కెరీర్ లో 'దీవార్', 'షోలే', 'జంజీర్', 'డాన్', 'కూలీ', 'సిల్సిలా', 'ముకద్దర్ కా సికందర్', సర్కార్ చిత్రాలు ఆయ‌న‌కు మరిన్ని కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టాయి. చివ‌రి సారిగా హిందీలో  'గులాబో సీతాబోలో క‌నిపించ‌గా, తెలుగులో సైరాలో మెరిసారు. ప్రస్తుతం ఆయన ఝండ్, బ్రహ్మాస్త్రా, చెహ్రేతోపాటు.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు. మ‌రోవైపు 'కౌన్ బనేగా కరోడ్‌పతి 12 రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని కూడా అలరిస్తున్నారు.


logo