నటీనటుల్లోని ప్రతిభాసామర్థ్యాల్ని పూర్తిస్థాయిలో వెలికితీసే చాలెంజింగ్ పాత్రలు ప్రతి సినిమాలో దొరకడం సాధ్యం కాదని అంటోంది తమన్నా. సినిమాల ఎంపికలో తాను ఎలాంటి ఫార్ములాలను ఫాలో అవ్వనని చెబుతోందీ మిల్కీబ్యూటీ. మూసధోరణికి పరిమితం కాకుండా నటనపరంగా తనకున్న హద్దుల్ని చేరిపేస్తూ నిరంతరం ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి ప్రయత్నిస్తానని అంటోంది. గత కొన్నేళ్లుగా సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది తమన్నా. తన భవిష్యత్ కార్యాచరణను గురించి తమన్నా మాట్లాడుతూ ‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు చాలా మారిపోయాయి. కథానాయికల్ని నవ్యమైన పాత్రల్లో చూడాలని వారు కోరుకుంటున్నారు. గ్లామరస్‌గా కనిపిస్తూ పాటలకు పరిమితమైతే తిరస్కరిస్తున్నారు. ఆ మార్పును దృష్టిలో పెట్టుకొని పాత్రల పరంగా వినూత్నతకు ప్రాముఖ్యతనిస్తున్నా.ప్రతిసారి ‘బాహుబలి’ మాదిరిగా నాలోని నటనప్రతిభను నిరూపించే సవాళ్లతో కూడిన సినిమాలు దొరకడం సాధ్యంకాదు. అలాంటి పాత్రలు అరుదుగా లభిస్తాయి. అయినా నేను ఏ రోజూ అసంతృప్తికి లోనుకాను. సొంతంగా పాత్రల్ని సృష్టించుకోవడానికి నేను రచయితను కాను. నటిని మాత్రమే. నాకు అప్పగించిన పాత్ర ఏదైనా దానికి శాయశక్తులా న్యాయం చేయడానికి కృషిచేస్తా’ అని చెప్పింది. ఓటీటీలలో అడుగుపెట్టడాన్ని కెరీర్ ఎదుగుదలగానే భావిస్తున్నానని, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రతిభను చాటుకోవాలని తపించే ఎంతో మందికి తాను స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పింది. భవిష్యత్తులో సినిమాలు, ఓటీటీకి సమప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతానని చెప్పింది.