మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 13:26:05

రియా చ‌క్ర‌వ‌ర్తి బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

రియా చ‌క్ర‌వ‌ర్తి బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

ముంబై : ఆర్థిక రాజ‌ధాని ముంబైని వ‌ర్షాలు ముంచెత్తాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబై హైకోర్టు నేటి త‌న విచార‌ణ‌ల‌న్నింటిని వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌ల‌తో స‌హా వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచార‌ణ వాయిదా ప‌డింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జస్టిస్ సారంగ్ కొత్వాల్ సింగిల్ బెంచ్ రియా బెయిల్ పిటిష‌న్‌ను బుధవారం విచారించాల్సి ఉంది. 

అంతేకాకుండా పాలిహిల్ ప్రాంతంలో తన బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడంపై బృహన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేషన్ (బిఎంసి) కు వ్యతిరేకంగా నటి కంగనా రనౌత్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను జస్టిస్ ఎస్ జె కథవల్లా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించాల్సి ఉంది. హైకోర్టు రిజిస్ర్టార్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ఈ కేసుల విచార‌ణ గురువారం కొన‌సాగ‌నున్న‌ట్లు తెలిపారు. ఏక‌ధాటిగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబైలోని చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ప‌లు చోట్ల ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయి. రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింద‌ని అధికారులు తెలిపారు. 


logo