మంగళవారం 07 జూలై 2020
Cinema - Jun 01, 2020 , 23:56:17

సంగీత దర్శకుడు వాజిద్‌ఖాన్‌ కన్నుమూత

సంగీత దర్శకుడు వాజిద్‌ఖాన్‌ కన్నుమూత

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వాజిద్‌ఖాన్‌ (42) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా   ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల వాజిద్‌ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  హిందీ చిత్రసీమలో సాజిద్‌-వాజిద్‌ సంగీత దర్శకద్వయంలో వాజిద్‌ఖాన్‌ ఒకరు.   సంగీత దర్శకుడిగా, గాయకుడిగా,  గేయరచయితగా బహుముఖప్రజ్ఞాశాలిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1998లో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ చిత్రంతో సాజిద్‌-వాజిద్‌ సంగీత దర్శకులుగా పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా సల్మాన్‌ఖాన్‌తో వీరికి మంచి అనుబంధం ఏర్పడింది. సల్మాన్‌ఖాన్‌ నటించిన హలోబ్రదర్‌, తేరేనామ్‌, ముజ్‌సే షాదీ కరోగీ, వాంటెడ్‌, దబాంగ్‌, వీర్‌తో పాటు పలు చిత్రాలకు సాజిద్‌-వాజిద్‌ అందించిన గీతాలన్నీ ప్రజాదరణ పొందాయి. నేపథ్య గాయకుడిగా దబాంగ్‌, దబాంగ్‌-2, రౌడీ రాథోడ్‌తో పాటు పలు సినిమాల్లో మాస్‌ పాటల్ని ఆలపించి మెప్పించారు. వాజిద్‌ఖాన్‌  హఠాన్మరణం పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘వాజిద్‌ చూపించిన ప్రేమ, గౌరవం శాశ్వతంగా గుర్తుండిపోతాయి. అద్భుత ప్రతిభావంతుడ్ని మిస్‌ అయ్యాం’ అని సల్మాన్‌ఖాన్‌ ఆవేదనను వ్యక్తంచేశారు. ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో సంతోషంగా కనిపించే వాజిద్‌ భాయ్‌ తొందరగా లోకాన్ని వీడటం బాధకరమని అక్షయ్‌కుమార్‌ అన్నారు. అమితాబ్‌బచ్చన్‌, అనిల్‌కపూర్‌, ప్రియాంకచోప్రాతో పాటు పలువురు బాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు వాజిద్‌ఖాన్‌కు సంతాపాన్ని తెలిపారు.  ముంబయిలోని వెర్సోవా స్మశానవాటికలో వాజిద్‌ఖాన్‌ అంత్యక్రియల్ని కుటుంబసభ్యులు నిర్వహించారు. 


logo