ముంబై: డ్రగ్స్ కేసు( Drugs Case )లో మరో బాలీవుడ్ నటుడు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం నటుడు అర్మాన్ కోహ్లిని ప్రశ్నించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ).. అతని ఇంట్లో నిషేధిత డ్రగ్స్ లభించడంతో అరెస్ట్ చేసింది. అర్మాన్ ఇంటి నుంచి చిన్న మొత్తంలో కొకైన్ లభించినట్లు ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ కొకైన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ కొకైన్ విదేశాల నుంచి ఇండియాకు ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు ఎన్సీబీ విచారణ జరుపుతోంది.
శనివారం అజయ్ రాజు సింగ్ అనే డ్రగ్ స్మగ్లర్ను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే ఆదివారం ఉదయం అర్మాన్ కోహ్లి ఇంట్లో దాడులు చేశారు. కొకైన్ లభించడంతో అతన్ని విచారణ కోసం తమ ఆఫీస్కు తీసెకెళ్లారు. బిగ్ బాస్ షోతోపాటు బాలీవుడ్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయోలాంటి బాలీవుడ్ మూవీస్లో అర్మాన్ నటించాడు.