గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 00:14:05

వసుధ ఒక రోజు జీవితం

వసుధ ఒక రోజు జీవితం

‘సనమ్‌ రే’, ‘కాబిల్‌'తో పాటు బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో గ్లామర్‌ తుళుకులతో ఆకట్టుకున్నది ఊర్వశి రౌటేలా. ఆమె కథానాయికగా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న చిత్రం ‘బ్లాక్‌రోజ్‌'. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో చీరకట్టుతో ఊర్వశి రౌటేలా కనిపిస్తోంది. నిర్మాత మాట్లాడుతూ ‘షేక్స్‌పియర్‌ రచించిన ‘ది మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌'లోని జ్యూయిష్‌ మనీ లెండర్‌ షైలాక్‌ పాత్ర స్ఫూర్తితో దర్శకుడు సంపత్‌నంది సృష్టించిన కథ ఇది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. యోగ్యత, విచక్షణ లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం అని కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోని సందేశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. మూడు వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఫైనాన్స్‌ కంపెనీలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా పనిచేసే వసుధ అనే ఆధునిక మహిళ జీవితంలో ఒక రోజులో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సౌందరరాజన్‌. 

logo