గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 08:47:19

బర్త్‌డే స్పెషల్‌: 25 సినిమాలకే ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్‌

బర్త్‌డే స్పెషల్‌: 25 సినిమాలకే ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరులోనే ఏదో కిక్కు ఉంటుంది. త‌న సినిమాలకి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ లెక్కుంటుంది.  ముక్కుసూటితనం, అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం, సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర ఆయ‌న‌ని అభిమానించే వారికి ఎన‌లేని ధైర్యాన్ని అందిస్తుంది. న‌టుడిగానే కాకుండా మాన‌వ‌తా వాదిగా ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గని ముద్ర వేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు 50వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రు ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

డాక్ట‌ర్‌ని కాబోయి యాక్ట‌ర్‌ని అయ్యాన‌ని చాలా మంది అంటుంటారు. కాని ప‌వ‌న్ డాక్ట‌ర్ కావాల‌నుకోలేదు, యాక్ట‌ర్ కావాల‌నుకోలేదు. ఏదో సాదాసీదాగా జీవితాన్ని కొన‌సాగించాల‌ని భావించాడు. కాని మెగాస్టార్ చిరంజీవి ప్రోద్భ‌లంతో సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ బుల్లెట్‌లా దూసుకెళుతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆయ‌న న‌ట ప్ర‌స్థానం అప్ర‌తిహ‌తంగా సాగుతుంది. రాజ‌కీయాల వ‌ల‌న రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వ‌గా, ఆయ‌న సినిమాల కోసం ఫ్యాన్స్ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు  

న‌టుడు అంటే కొంత వ‌రకే అభిమానం ఉంటుంది. కాని అభిమానులు ఆయ‌న‌ని దేవుడి క‌న్నా ఎక్కువ‌గా కొల‌వడాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతుంటారు. కేవ‌లం 25 సినిమాల‌తోనే ఇంత ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్న ప‌వ‌న్ మాన‌వ సేవే మాధ‌వ సేవ అనే సిద్దాంతాన్ని ఎక్కువ‌గా న‌మ్ముతారు.న‌టుడిగా, జ‌న‌సేన అధినేత‌గా ముందుకు సాగుతున్న ప‌వ‌న్ .. నేనెప్పుడు ట్రెండ్ ఫాలో కాను, సెట్ చేస్తా అని అంటారు. త‌న సినిమాల‌తో ఎంద‌రికో లైఫ్ ఇచ్చిన ప‌వ‌న్ అభిమానుల‌కే కాదు కొంద‌రు సెల‌బ్రిటీల‌కు కూడా ఆరాధ్య దైవం.

అక్క‌డ అబ్బాయి ఇక్క‌డ అమ్మాయి అనే సినిమాతో కెరీర్ మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ‌ద్రి సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఇక ఖుషి సినిమాతో ప‌వర్ స్టార్‌గా మారిన ఆయ‌న గ‌బ్బ‌ర్ సింగ్‌తో రెచ్చిపోయారు. ఖుషీకు, గ‌బ్బ‌ర్ సింగ్‌కు మ‌ధ్య వ‌చ్చిన చిత్రాల‌న్నీ అంత‌గా ఆడ‌క‌పోయిన ప‌వ‌న్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇవాళ ప‌వ‌న్ కొన్ని సినిమాల‌కు మార్కెట్ వాల్యూ పెంచాడు. ఎన్ని ఫ్లాప్స్ వ‌చ్చిన కూడా ప‌వ‌న్‌తో సినిమా అంటే నిర్మాత‌లు క్యూలో ఉంటారు 

అత్తారింటికి దారేది చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ త‌ర్వాత‌ అంత‌గా అల‌రించ‌లేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఆయ‌న చేస్తున్న వ‌కీల్ సాబ్ చిత్రం, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న 27వ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న 28వ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఆయన సినిమాల‌కి మ‌న‌దేశాంలోనే కాదు ఓవ‌ర్సీస్‌లోను భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. వెండితెర‌పై త‌న హీరోయిజంతో ఎంతో మందిని ఆక‌ట్టుకున్న ప‌వ‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటార‌నేది అంద‌రికి తెలిసిన స‌త్యం.

ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్ధేశంతో జ‌న‌సేన అనే పార్టీని స్థాపించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ రెండు చోట్లు పోటీ చేయ‌గా, ఆ రెండు స్థానాల‌లో ఓట‌మి పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికి అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుదాం అంటూ త‌న‌ని న‌మ్మిన జ‌న‌సైనికులకి కొండంత ధైర్యాన్ని అందించారు. ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, జ‌న‌సైనికులు దేశ విదేశాల‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. త‌న‌కి ఇంత ఆద‌ర‌ణ‌, ప్రేమ ద‌క్క‌డం పూర్వ జ‌న్మ సుకృతం అంటారు ప‌వ‌న్.

త‌న‌కి సంబంధించిన వేడుక‌లు జ‌రుపుకోవ‌డం కాని, లేదంటే ఏదైన వేడుక‌ల‌కి హాజ‌రుకావ‌డం కాని ప‌వ‌న్‌కు ఏ మాత్రం న‌చ్చ‌దు. సింప్లిసిటీగా ఉంటూ వ‌స్తున్న‌ప‌వ‌న్ ఈ రోజు త‌న 50వ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు కూడా దూరంగా ఉంటున్నాడు. కాని ఆయ‌న అభిమానులు, జ‌న‌సైనికులు మాత్రం ఘ‌నంగా బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ సంతోషం వ్య‌క్తం చేస్తూ వారంద‌రికి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు రూపొందించిన వీడియో ప్ర‌తి ఒక్కరిని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ప‌వ‌న్ గురించి ప‌లువురు మాట్లాడుతున్న మాట‌లతో పాటు ఆయ‌న డైలాగులు మాంచి కిక్ ఇస్తున్నాయి. ఈ వీడియోపై కూడా ఓ లుక్కేయండిlogo