బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..

హైదరాబాద్ : విజయ్ సేతుపతి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరోకున్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, బాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి నటుడు పుట్టినరోజు నాడే వివాదంలో ఇరుక్కున్నాడు. జనవరి 16న విజయ్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయించారు దర్శక నిర్మాతలు. ఇదే ఆయన్ను వివాదంలోకి లాగింది. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు సైతం చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా దర్శక నిర్మాతలు పెద్ద కత్తితో కేక్ కోయించారు. ఇదే వివాదానికి దారితీసింది.
వేరే వాళ్లు చేస్తే రచ్చ చేస్తారు.. ఇప్పుడు విజయ్ మాత్రం సెలబ్రిటీ అని వదిలేస్తారా.? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. అప్పట్లో కొందరు సంఘ విద్రోహశక్తులు ఇలాగే చేస్తే పోలీసులు అరెస్టు చేశారు.. కానీ ప్రముఖుల విషయంలో ఇది వర్తించదా.. అంటూ ప్రశ్నించే సరికి విజయ్ దిగొచ్చాడు. తన వల్ల జరిగిన తప్పుకు క్షమాపణ కోరాడు. ప్రస్తుతం విజయ్ పొన్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఖడ్గానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే చిత్రబృందం తనతో పెద్ద కత్తితో కేక్ చేయించారని.. అది వివాదం అవుతుందని ఊహించలేదని సేతుపతి చెప్పాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండంటూ ట్వీట్ చేశాడు. ఈ మధ్యే మాస్టర్ సినిమాలో విలన్ పాత్రలో అలరించాడు విజయ్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్లో అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ ఛడ్డాలోనూ నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.