శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 14:15:32

అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్

అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్

అప్పుడెప్పుడో సుడిగాడు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. ఈ క్రమంలోనే ఈమెకు 2020లో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్లి ఏకంగా 98 రోజులు ఉంది. ఆ షో నుంచి ఒకటి రెండు కాదు 40 లక్షల వరకు సంపాదించుకుంది మోనాల్. అన్నింటికి మించి అదిరిపోయే ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కోరుకున్న గుర్తింపును ఈ ఒక్క షో మోనాల్ గజ్జర్ కు తీసుకొచ్చింది. దాంతో ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత వరస ఇంటర్వ్యూలు ఇస్తుంది. దాంతో పాటు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యే అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది మోనాల్ గజ్జర్. ఇందులో కేవలం 4 నిమిషాల ఐటం సాంగ్ కోసం ఏకంగా 15 లక్షలు తీసుకుంది మోనాల్. 

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీ రాముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశమంతా పూజించే దేవుడిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు నీకు శ్రీ రాముడి గురించి ఏం తెలుసు.. దేవుడి గురించి నోరు పారేసుకునేంత గొప్ప దానివి అయిపోయావా అంటూ నిలదీస్తున్నారు. ఏ హక్కు ఉందని రాముడి గురించి మాట్లాడావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాబోయే వాడి గురించి కామెంట్ చేసింది మోనాల్. అందులో భాగంగానే మీకెలాంటి మొగుడు కావాలంటూ యాంకర్ అడిగితే శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలి అంటూ జవాబిచ్చింది.

అదేంటి.. ఏ అమ్మాయైనా శ్రీ రాముడి లాంటి మొగుడు కావాలంటారు కానీ మీరేంటి కృష్ణుడు అంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్నిస్తే.. దానికి ఊహించని సమాధానం చెప్పింది మోనాల్ గజ్జర్. తనకు రాముడు నచ్చడని..అనవసరంగా సీతను అనుమానించాడని..ఎవరో చెప్పిన మాటలను నమ్మి భార్యను అడవుల పాలు చేసాడంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆయన తనకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాముడు అలా చేసాడు కాబట్టే సీత పాతివ్రత్యం ప్రపంచానికి తెలిసింది అంటూ మండి పడుతున్నారు. ఏదేమైనా కూడా మోనాల్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo