గొల్ల, కురుమలు లేని ఊరుండదు. వీరి సంస్కృతి, ఆచార వ్యవహారాలు సుసంపన్నమైనవి. గొర్ల, మేకల, పశువుల పెంపకం, పాలు, మాంస ఉత్పత్తి, గొంగళ్ల నేత మొదలైనవి వీరి వృత్తి. గొర్రె ఉన్నితో తయారయ్యే గొంగళ్లు మనుషులను చలి నుంచి కాపాడుతున్నాయి. గొర్రె తోలుతో తయారయ్యే జగ్గు, డోలు, కంజెర లాంటి వాయిద్యాలు తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ముఖ్యమైనవి.
గొర్రె ఎరువుతో భూములు సారవంతమవుతున్నాయి. తెలంగాణలో గొల్ల, కురుమల జనాభా 12 శాతం. వీరి ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భారతీయ గ్రామీణ సమాజంలో వ్యవసాయం తర్వాత చెప్పుకోదగింది గొల్ల, కురుమల వృత్తి. దేశంలో వృత్తిపనుల ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా మాత్రమే నిరుద్యోగాన్ని రూపుమాపటం సాధ్యమవుతుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసి అన్ని కులాల వారికి వృత్తిపనుల ద్వారా చేతి నిండా ఆదాయం ఉండేలా కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేశారు. ఇదేరీతిలో గొల్ల, కురుమలకు గొర్లు, మేకలు అందిస్తున్నారు.
మూడు లక్షల ఎనభై వేల కుటుంబాలకు కేసీఆర్ గొర్రెలు పంపిణీ చేశారు. లక్షల కుటుంబాలకు గొర్లు పంపిణీ చేయటానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. మన రాష్ట్రంలో గొర్లు, మేకల పెంపకాన్ని ఇంతవరకు సంప్రదాయ పద్ధతుల ద్వారానే చేస్తున్నారు. పొద్దంతా తిప్పుతూ దొరికిన గడ్డిని మేపడం ద్వారా గొర్లు, మేకల పోషణ జరుగుతున్నది. బీడు భూములు, బంజరు భూములు, గుట్టలు తగ్గడం వల్ల వాటికి మేత కరువైంది. ఇదిలా ఉంటే ఓ దిక్కు మాంసం అవసరాలు పెరుగుతున్నాయి. ఈ అవసరాలు తీర్చి, మాంసం ఎగుమతులు పెంచి రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచాలంటే గొర్ల పెంపకాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేయాలి. ఒకప్పుడు కోళ్లు ఇండ్లలో మాత్రమే పెంచుకునేవారు. పౌల్ట్రీ ఫామ్లు వచ్చిన తర్వాత కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఆదాయాలు పెరిగి చాలామందికి ఉపాధి లభించింది. దీంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. గొర్లు, మేకల పెంపకం, ఉన్ని ఉత్పత్తులను పరిశ్రమగా గుర్తించటం ద్వారా గొల్లకురుమ యువతరానికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది.
గొర్లు, మేకల పెంపకాన్ని పరిశ్రమగా గుర్తించాలంటే అందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలి. మన రాష్ట్రంలో ఏ జాతి గొర్రె, మేకలు పెరిగే వాతావరణం ఉందో మొదట అధ్యయనం చేయాలి. వాటికి నిర్మించాల్సిన షెడ్లు, కేటాయించాల్సిన భూమి, గ్రాసం, రోగాలకు మందులు మొదలైన అంశాలపై అధ్యయనం చేయాలి. ఈ జీవాలను మందలుగా చేరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూమికి సంబంధించిన పరీక్షలు చేయాలి. గొర్లు, మేకల పెంపకం, ఉన్నికి సంబంధించిన పరిశ్రమ పరిశోధనా కేంద్రాలను స్థాపించాలి. తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తుండటం హర్షణీయం.