మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 17:08:51

రియా మ్యాజిక్‌.. బెంగాలీలు టార్గెట్ !

రియా మ్యాజిక్‌.. బెంగాలీలు టార్గెట్ !

హైద‌రాబాద్‌: బ్లాక్ మ్యాజిక్‌.. దీన్నే కాలా జాదు అంటారు. మ‌నం చేత బ‌డి అంటాం.  బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణానికి బ్లాక్ మ్యాజిక్ కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి చేత‌బ‌డి చేయ‌డం వ‌ల్లే సుశాంత్ చ‌నిపోయిన‌ట్లు క‌థ‌నాలు వ్యాపిస్తున్నాయి.  ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో బెంగాలీ మ‌హిళ‌ల్ని టార్గెట్ చేస్తున్నారు.  బెంగాలీ ఆడ‌వాళ్లు చేతబ‌డిలో ఆరి తేరి ఉంటార‌న్న సోష‌ల్ మీడియా పోస్టులు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయి.  రియా చ‌క్ర‌వ‌ర్తి బెంగాలీ అమ్మాయి కావ‌డంతో.. ఆ మార్మిక విద్య‌లో బెంగాలీ స్త్రీలు నిష్ణాతులన్న ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి.  సుశాంత్ అకౌంట్ నుంచి పూజ కోసం కొన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు అయిన‌ట్లు కూడా కొన్ని ఆధారాలు దొరికాయి. సుశాంత్ తండ్రి కృష్ణ‌కుమార్ కూడా త‌న ఫిర్యాదులో రియా బ్లాక్ మ్యాజిక్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు.  సుశాంత్ ఆఫీస్ బాయ్ కూడా రియా బ్లాక్ మ్యాజిక్ చేసింద‌న్నాడు.  దీంతో ఇప్పుడు ఆన్‌లైన్‌లో బెంగాలీ ఆడ‌వాళ్ల చేత‌బ‌డి విద్య‌ల‌పై పోస్టులు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. 

ప్ర‌స్తుతం కేసు కోర్టులో ఉన్న కార‌ణంగా.. రియా దీనిపై స్పందించ‌లేదు. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం బెంగాలీ ఆడ‌వాళ్ల‌పై ట్రోలింగ్ విప‌రీతంగా న‌డుస్తున్న‌ది.  బెంగాలీ స్త్రీలు.. గోల్డ్ డిగ్గ‌ర్స్ అని, చెలాకీల‌ని, ఆధిప‌త్యం చెలాయిస్తార‌ని, విష‌పూరిత‌మ‌ని, భ‌ర్త‌ల‌ను ఏటీఎంల త‌ర‌హాలో వాడుతార‌ని, మ‌గ‌వారీ జీవితాల‌ను నాశ‌నం చేస్తార‌న్న కామెంట్ల‌తో నెటిజ‌న్లు రెచ్చిపోతున్నారు.  మ‌గ‌వారిని లొంగ‌దీసుకునే శ‌క్తి బెంగాలీ ఆడ‌వాళ్ల‌కు ఉన్న‌ట్లు కొంద‌రు కామెంట్ల‌తో కాటేస్తున్నారు. అయితే కొంద‌రు బెంగాలీ మ‌హిళ‌లు కూడా స్పందించారు. త‌మ‌కు జాదు విద్య‌లు తెలియ‌వ‌న్నారు.  త‌మ‌కేమీ అద్భుత శ‌క్తులు లేవంటూ కామెంట్ చేస్తున్నారు. 

బెంగాలీ ల‌డికియా బ‌హుత్ తేజ్ హూతీహై  అంటూ ఒక‌రు కామెంట్ చేశారు. అంటే వాళ్లు చాలా తెలివైన వారు అని అర్థం కాదు.. కానీ వాళ్లు నైతిక విలువ‌లు పాటించ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చే విధంగా ఆ కామెంట్ చేశారు. బాలీవుడ్‌లో బ్లాక్‌మ్యాజిక్ సంఘ‌ట‌న‌లు గ‌తంలోనూ జ‌రిగిన‌ట్లు కొన్ని క‌థ‌నాలు ఉన్నాయి. కంగ‌నా ర‌నౌత్ త‌న‌పై చేత‌బ‌డి చేసిన‌ట్లు అద్యాయ‌న్ సుమ‌న్ ఆరోపించారు. వాస్త‌వానికి ప్రాచీన గ్రంధాల్లోనూ బ్లాక్‌మ్యాజిక్ విద్య‌ల గురించి క‌థ‌నాలు ఉన్నాయి. స్త్రీల‌ను వ‌శ‌ప‌రుచుకునే నెపంతో కొంద‌రు మ‌గ‌వాళ్లు ఇలాంటి విద్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు క‌థ‌లు ఉన్నాయి. సుశాంత్ కేసులో రియా ఏమైనా మ్యాజిక్ చేసిందా లేదా తేల్చాల్సింది ముంబై పోలీసులే. 
logo