శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 10:12:01

బీటౌన్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు విచారణకు రకుల్‌

బీటౌన్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు విచారణకు రకుల్‌

హైదరాబాద్‌ : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కాగా.. తర్వాత డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. విచారణలో తవ్వినకొద్ది ఈ కేసులో కొద్ది ప్రముఖల పేర్లు బయపటపడుతున్నాయి. ఇప్పటికే అతని ప్రియురాలు రియాచక్రవర్తిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి చేశారు. బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్‌, రకుల్‌‌ ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌లకు సమన్లు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. సుశాంత్‌ జూన్‌ 14న బాంద్రాలోని తన ప్లాట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతి కారణం రియాచక్రవర్తేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పలు వివాదాల అనంతరం కేసు విచారణకు సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించింది. నగదు లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సైతం విచారణ ప్రారంభించింది.

వాట్సాప్‌ చాట్‌తో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి..

ఈడీ విచారణలో భాగంగా రియాచక్రవర్తి వాట్సాప్‌ చాట్‌ను అధికారులు పరిశీలించగా.. ఇందులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. టాలెంట్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ జయ సాహాతో వాట్సాప్‌ చాట్‌లో ప్రస్తావించిన అంశాల ఆధారంగా దర్యాప్తు చేయాలంటూ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరోకు సూచించింది. ఈ మేరకు విచారణ చేపట్టారు. సుశాంత్‌కు రియా డ్రగ్స్‌ అందించిందన్న ఆరోపణలతో రియాను ఈ నెల 9న అధికారులు ఆరెస్టు చేశారు. జయ సాహాను ప్రశ్నించడంతో ప్రముఖ నటి దీపికా పదుకొనే పేరు తెరపైకి వచ్చింది. జయ వాట్సాప్‌ చాట్‌లో దీపికా మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి చర్చించినట్లు ఎన్‌సీబీ అధికారులు భావిస్తున్నారు. దీపికతో పాటు శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పలువురి పేర్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు వీరందరికీ సమన్లు జారీ చేశారు.

ఇవాళ విచారణకు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, డిజైనర్‌ సిమోన్‌ 

గురువారం రకుల్‌ ప్రీత్‌సింగ్‌, డిజైనర్‌ సిమోన్‌ కంబాత, సుశాంత్‌ మేనేజర్‌ సుశాంత్‌ శృతి మోదీని అధికారులు విచారణకు పిలిచారు. శుక్రవారం దీపిక పదుకొనే, శనివారం శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ను తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు హీరోయిన్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ కేసులో ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ను విచారణకు పిలువగా, అనారోగ్య కారణాలతో రాలేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో కరిష్మాను కూడా ఇవాళ విచారించాలని ఎన్‌సీబీ నిర్ణయించింది. జయ సాహా, కరీష్మాల మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌లో డీ అంటే దియామీర్జా అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఆ వార్తలను దియామీర్జా ఖండించింది. ఈ పరిణామాల బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం మరోసారి చర్చనీయాంశమైంది.

దీపిక పార్టీపై సందేహాలు

దీపికకు అధికారులు సమన్లు జారీ చేయగా.. ఆమె గతంలో తన స్నేహితులకు ఇచ్చిన పార్టీపై అందరి దృష్టి పడింది. బాంద్రాలోని అత్యంత విలాసవంతమైన కోకోబార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో 2017లో దీపిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి అనేక మంది బాలీవుడ్‌ హీరో హీరోయిన్లు హాజరయ్యారు. వారంతా ఆ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌లోకి డ్రగ్స్‌ రావడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో ఎన్‌సీబీ అధికారులున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌, అమృత్‌సర్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయనేదానిపై దృష్టి పెట్టింది. హెరాయిన్‌, కొకైన్‌ వంటి సరఫరా చేసేవారిని పట్టుకునేందుకు సరైన ఆధారాలుండాలని, ఆధారాలు లభించిన వెంటనే డ్రగ్స్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన డ్రగ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతోనూ చర్చిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.