శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 00:32:21

రంగు తక్కువగా ఉన్నావన్నారు!

రంగు తక్కువగా ఉన్నావన్నారు!

‘ప్రస్తుతం కమర్షియాలిటీకి అర్థం మారిపోయింది. వైవిధ్యమైన కథల్ని సహజత్వంగా ఆవిష్కరించే ధోరణి పెరిగిపోయింది. అలాంటి సినిమాల్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని చెప్పింది చాందిని చౌదరి. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘కలర్‌ఫొటో’. సందీప్‌రాజ్‌ దర్శకుడు. సాయిరాజేష్‌నీలం, బెన్నీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ఆహా ఓటీటీ ద్వారా విడుదలకానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో చాందిని చౌదరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కెరీర్‌ ఆరంభంలో అందరికీ నచ్చాలనే ఆలోచనలతో సినిమాలు చేశాను. ఇప్పుడు ఆ పంథాను మార్చుకున్నా.  వ్యక్తిగతంగా నాకు సంతృప్తినిచ్చిన మంచి సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నా. నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని, నా ప్రతిభను పరిపూర్ణ స్థాయిలో నిరూపించుకున్నానని అనుకోవడం లేదు. గత సినిమాల ఛాయలు  కనిపించకుండా నటన, పాత్రల ఎంచుకునే ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా జాగ్రత్తపడుతున్నా. 1990ల కాలంలో చిన్న టౌన్‌లో జరిగే కథ ఇది. ఇందులో స్వాతంత్య్ర భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తా. తన మనసుకు నచ్చినట్లుగా జీవించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. 90ల కాలం నాటి పాత్ర కావడంతో మా అమ్మ సలహాలు తీసుకొని నటించా.  తననే స్ఫూర్తిగా తీసుకొని ఈ పాత్ర చేశాను.  సినిమాలో నా నటన చూసి కన్నీళ్లువచ్చాయి. మంచి సినిమా చేశాననే సంతృప్తిన్నిచ్చింది. వర్ణ వివక్ష సమాజంలో చాలా ఉంది. నేను అలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నా. రంగు తక్కువగా ఉన్నావని నన్ను కూడా అన్నారు.  రంగును చూసి మనిషి వ్యక్తిత్వాన్ని, స్థాయిని అంచనా వేయడం సరికాదు. అదే ఈ సినిమాలో చూపించబోతున్నాం. సుధీర్‌వర్మ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నా. అలాగే విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ గామీ’లో నటిస్తున్నా. హిమాలయాల నేపథ్యంలో అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది.  ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నా’ అని చెప్పింది.


logo