ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 13:48:04

బాలు గ‌ళం నుండి జాలువారిన ఆణిముత్యాలు

బాలు గ‌ళం నుండి జాలువారిన ఆణిముత్యాలు

త‌న సంగీతంతో కోట్లాది ప్రేక్ష‌కుల‌ని రంజింప‌జేసిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. పాటలోని మాటలను ...గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. స‌ప్త స్వ‌రాల‌ను అవ‌లీలలగా ప‌లికించే బాలు తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం

బాలు గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు. ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ.  తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత వ‌న్నె తెచ్చిన ఆ బాల‌గోపాలుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యాడు బాలు. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు.

స్వర్ణయుగ సంగీత దర్శకుల అధ్వర్యంలో పాడే అరుదైన అదృష్టం బాలుకు దొరికింది. పెండ్యాల సార‌ధ్యంలో తొలిసారి ఓ పాట పాడిన బాలు తాతినేని చలపతిరావుచ, యం.యస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్‌ నాయుడు, అశ్వథామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి వంటి స్వర్ణయుగ సంగీత దర్శకులవద్ద బాలు కొన్ని వేల మరపురాని మధుర మైన పాటలు పాడారు. అలా ముప్పై అయిదు వేల పాటలకు పైగా పాడిన బాలు త‌న కంఠ‌స్వ‌రంతో సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రింప‌జేశారు. 

బాలు పాడిన పాటల్లో మంచి పాటలను వెలికి తీయటమంటే, సాగర గర్భంలో ఆణిముత్యాన్ని వెతికే సాహసం చేయటమే. ఆకాశాన్ని జల్లెడ పట్టి చుక్కల్ని లెక్కపెట్టే ప్రయత్నం చేయడ‌మంతా పిచ్చితనమే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పాడిన పాట‌ల‌లో వీటిని వింటే పుల‌కించ‌కుండా ఉండ‌లేము.


* నెలరాజా పరుగిడకు (అమరగీతం)

* మధుమాస వేళలో (అందమె ఆనందం)

* సిరిమల్లె నీవే, ఎడారిలో కోయిల  (పంతులమ్మ)

* మల్లెలు పూచే (ఇంటింటి రామాయణం)

* చుట్టూ చెంగావి చీర (తూరుపు వెళ్ళే రైలు)

* కళకే కళ నీ అందమూ (అమావాస్య చంద్రుడు)

* కీరవాణి చిలకల కొలికిలో (అన్వేషణ)

* చక్కనైన ఓ చిరుగాలి (ప్రేమ సాగరం)

* విధాత తలపున (సిరివెన్నెల) 

* ఆవేసమంతా ఆలాపనేలే (ఆలాపన)

* రేగుతున్నదొక రాగం (డాన్స్ మాస్టర్)

* ప్రియతమా నా హృదయమా (ప్రేమ)

* మాటేరాని చిన్నదాని (ఓ పాపా లాలి)

* చెలీ రావా వరాలీవా (మౌనరాగం)

* ఓ పాపా లాలి (గీతాంజలి)

* కమ్మని ఈ ప్రమలేఖని (గుణ)

* పూ లతలే పూచెనమ్మా (హృదయం)

* సుమం ప్రతిసుమం సుమం (మహర్షి)

* ప్రియతమా ప్రియతమా (ప్రియతమా)

* పువ్వై పుట్టి పూజే చేసి (రాగమాలిక)

* తరలిరాద తనే వసంతం, చుట్టూ పక్కల చూడరా (రుద్రవీణ)

* నిను తలచి మైమరచా (విచిత్ర సోదరులు)

* కధగా కల్పనగా, యీలోకం అతి పచ్చన (వసంత కోకిల)

* పచ్చ పచ్చాని కల వేసే బంగారు వల (తూర్పు సింధూరం)

* ప్రేమ లేదనీ (అభినందన)

* నాగమల్లి తోటలలో ఈ వలపు పాటలలో (అనురాగ సంగమం)

ఆకాశాన్ని కొలవటం, సముద్రంలోని నీటిని తోడటం, సూర్యుని చేతితో తాకటం సాధ్యపడిన నాడు, బహుశా బాలు పాటల్లో కూడా మంచి పాట‌లు, చెడ్డ పాట‌లు అని స‌ప‌రేట్ చేయ‌డం కుద‌ర‌దేమో! 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 11 భాషలలో, 40 వేలకు పైగా పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి అరుదయిన రికార్డు సృష్టించారు బాలు.logo