బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 13:41:09

అవార్డుల‌కే వ‌న్నె తెచ్చిన గాన గంధ‌ర్వుడు

అవార్డుల‌కే వ‌న్నె తెచ్చిన గాన గంధ‌ర్వుడు

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మంచి పాట‌కారే కాదు మాట‌కారి కూడా. ఒక్కోసారి త‌న చ‌మ‌త్కారంతో ఎంతో మందిని తెగ న‌వ్విస్తుంటారు. అలానే నలుగురు గురించి నాలుగు మంచి మాట‌లు చెప్పే స‌ద్గుణ  సంప‌న్నుడు బాలు వ‌ర్త‌మాన త‌రానికి సంబంధించిన ఎన్నో విష‌యాలు విశ్లేషిస్తుంటారు. కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌ సారధ్యంలో ఒకేరోజు 21 పాటలు పాడి రికార్డు సృష్టించారు. 

బాలుకు రికార్డులు కొత్త కాదు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మభూష‌ణ్‌తో పాటు ఎన్నో అవార్డుల‌ని అందుకున్న బాల సుబ్ర‌హ్మ‌ణ్యం  ఒకేరోజు తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి స‌రికొత్త  రికార్డు సాధించారు. హిందీ సంగీత దర్శకుడు ఆనంద్‌ మిలింద్‌కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాసు తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి.

సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట ‘మన్మధలీల’ తెలుగు చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారు. తదనంతరకాలంలో కమల్‌ హసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, నాగేష్, కార్తిక్, రఘువరన్, సల్మాన్‌ ఖాన్, అనిల్‌ కపూర్‌ వంటి నటులకు తన గొంతు అరువిచ్చారు. ముఖ్యంగా ‘దశావతారాలు’ చిత్రంలో కమల్‌ నటించిన ఏడు పాత్రలకు వైవిధ్యమైన గొంతుతో సంభాషణలు పలికిన తీరు అచ్చెరువుగొలిపింది. అన్నమయ్య, శ్రీ సాయి మహిమ చిత్రాల్లో డబ్బింగ్‌ చెప్పినందుకు బాలు ఉత్తమ డబ్బింగ్‌ కళాకారునికి ఇచ్చే నంది బహుమతులు గెలుచుకున్నారు. 

బాలు ఉత్త‌మ గాయ‌కుడిగా శంకరాభరణం (1979), ఏక్‌ దూజే కే లియే (1981), సాగరసంగమం (1983), రుద్రవీణ (1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్‌ (1995-కన్నడ), మిన్సార కణవు (1996-తమిళం) చిత్రాల‌కు నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో ఉత్తమ గాయకునికి ఇచ్చే ఫిలింఫేర్‌ బహుమతులు బాలుని ఏడు సార్లు వరించాయి. ఉత్తమ గాయకునిగా 18 నంది బహుమతులతోబాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ‘మయూరి’ చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో నటనకు ప్రత్యేక జూరీ బహుమతి లభించింది

మైనే ప్యార్ కియా చిత్రంలోని పాట‌ల‌కు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న బాలు, నౌషాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో పాడిన తేరే పాయ‌ల్ మేరే గీత్ పాట‌కు మియాతాన్ సేన్ సుర్ సింగ‌ర్ సంజార్ అవార్డ్ అందుకున్నారు.  రాజాలక్ష్మీ ఫౌండేషన్, సుర్‌ సేన్, అక్కినేని, లతామంగేష్కర్‌ జాతీయ బహుమతుల తోబాటు లెక్కలేనన్ని ఇతర బహుమతులు బాలుని వరించాయి. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి బాలుని సత్కరించగా,  2011లో పద్మభూషణ్‌ అవార్డును  అందుకున్నారు. ఇక ఎన్నో ప్ర‌ముఖ ప‌త్రిక‌లు, ప్ర‌ఖ్యాత సంస్థ‌లు ఆయ‌న‌కు ఇచ్చిన అవార్డులు అసంఖ్యాకం.


logo