బుధవారం 03 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 15:47:39

భీష్ముడిగా బాలకృష్ణ..ఫొటోలు వైరల్‌

భీష్ముడిగా బాలకృష్ణ..ఫొటోలు వైరల్‌

ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండేళ్ళ కింద బాలయ్య మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్. ఒక్క భాగంలో తండ్రి కథను చెప్పలేక కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా తీసుకొచ్చాడు. అయితే ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్ అయ్యాయి. తన తండ్రి బయోపిక్ చేసి తప్పు చేశానంటూ ఆ తర్వాత బాధ పడ్డాడు బాలయ్య. ఇంకాస్త శ్రద్ధగా బయోపిక్ చేసుండాల్సింది అంటూ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముందు ఈ సినిమాను తేజ దర్శకత్వంలో మొదలు పెట్టి ఆ తర్వాత శాతకర్ణి దర్శకుడు క్రిష్ కు అవకాశం ఇచ్చాడు. అయితే సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాలో బాలయ్య వేసిన గెటప్స్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాల కోసం బాలయ్య బాగా కష్టపడ్డాడు.

తండ్రిలా కనిపించడానికి తనను తాను చాలా మార్చుకున్నాడు. ముఖ్యంగా అప్పట్లో ఎన్టీఆర్ వేసిన చాలా గెటప్స్ ఈ సినిమాల్లో వేశాడు బాలయ్య. ఈ రెండు సినిమాల్లో మేకప్ టీం పడిన కష్టం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది కూడా. వాళ్ల కష్టానికి గుర్తింపు కూడా బాగానే వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో అయితే అచ్చంగా అన్నగారినే చూసినట్లుంది అంటూ బాలయ్య అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ బయోపిక్ కోసం కృష్ణుడు, భీముడు, అర్జునుడు సహా పౌరాణిక పాత్రలు అన్నీ వేశాడు బాలయ్య. అందులో భీష్మ కూడా ఉంది. 

అప్పట్లో ఎన్టీఆర్ భీష్మ పాత్రలో కనిపించాడు. అదే పాత్రను బయోపిక్ కోసం బాలయ్య కూడా పోషించాడు. అయితే అది సినిమాలో లేదు. నిడివి కారణంగా ఈ సన్నివేశాలను తీసేశాడు దర్శకుడు క్రిష్. అయితే మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా చిత్రంలో తాను  భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను బాలయ్య విడుదల చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భీష్ముడి గెటప్‌లో బాలయ్య ఉన్న ఫోటోలు అభిమానులు వైరల్ చేస్తున్నారు. అందులో బాలయ్య గెటప్ చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. భలే ఉన్నాడ్రా బాలయ్య బాబు.. ఈ గెటప్ ఎందుకు సినిమాలో పెట్టలేదు.. పెట్టుంటే భలే ఉండేదిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా భీష్మగా బాలయ్య ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


VIDEOS

logo