శుక్రవారం 03 జూలై 2020
Cinema - Mar 10, 2020 , 23:18:33

ప్రభాస్‌ జోడీగా

ప్రభాస్‌ జోడీగా

‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. అతడితో నటించేందుకు బాలీవుడ్‌ అగ్ర తారలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ చిత్రం తెరకెక్కబోతున్నది. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.  ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా  కత్రినాకైఫ్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ నాయికను హీరోయిన్‌ తీసుకోవాలని భావించిన చిత్రబృందం కత్రినాకైఫ్‌ పేరును పరిశీలిస్తున్నట్లుగా  తెలిసింది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ఇదివరకు తెలుగులో ‘అల్లరి పిడుగు’, ‘మల్లీశ్వరి’ చిత్రాల్లో నటించింది కత్రినా.


యూరప్‌లో  ప్రభాస్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్నది. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణమూవీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ యూరప్‌లో జరుగుతున్నది. ప్రభాస్‌తో  పాటు అంతర్జాతీయ నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో ఓ ఛేజింగ్‌ సీక్వెన్స్‌ను పూర్తిచేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. యూరప్‌లో మరో లాంగ్‌ షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నట్లు  పేర్కొన్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవయ్యవ చిత్రమిది.  ఈ సినిమాకు ‘జాన్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


logo