మన హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్‌లోను రాణిస్తున్న విషయం తెలిసిందే. యువ హీరో విజయ్ దేవరకొండ రౌడీ పేరుతో బట్టల దుకాణం ప్రారంభించి రన్ చేస్తుండగా, ప్రొడక్షన్ హౌస్, ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్‌లోను సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏ.వి.డి సినిమాస్ పేరుతో తన సొంత ఊరు మహబూబ్ నగర్లో థియేటర్ ఓపెన్ చేశాడు.
డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్ రంగాలలో సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో విజయ్ దేవరకొండ ఏ.వి.డి సినిమాస్ మల్టీప్లెక్స్ నిర్మించగా, బుధవారం మహబూబ్ నగర్లో ప్రారంభించారు. డాల్బీ అట్మాస్, లగ్జరీ సీటింగ్ వంటి అధునాతన హంగులతో ఈ థియేటర్ రూపొందగా, ఇది మంచి ఎక్స్పీరియన్స్ అందించనుంది
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ , విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విజయ్ ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న క్రమంలో హాజరు కాలేకపోయాడు. కాగా, ఏ.వి.డి సినిమాస్‌లో ప్రదర్శించే మొదటి సినిమా ‘లవ్ స్టోరి’యేనని ఏ.వి.డి సినిమాస్ అధినేతలు తెలిపారు.