శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 00:38:10

రవితేజతో అప్సరారాణి ఆటపాట

రవితేజతో  అప్సరారాణి ఆటపాట

రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ‘థ్రిల్లర్‌' చిత్రంలో గ్లామర్‌ తళుకులతో ఆకట్టుకున్నది అప్సరారాణి. తాజాగా ఆమె రవితేజతో ప్రత్యేకగీతంలో నటించబోతున్నది.  రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్‌ కథానాయిక. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో రవితేజ, అప్సరారాణిలపై  ప్రత్యేకగీతాన్ని చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి జానీమాస్టర్‌ నృత్యాల్ని సమకూర్చుతున్నారు. తమన్‌ స్వరకర్త. ‘తెలుగు రాష్ర్టాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. వృత్తినిర్వహణలో ఓ పోలీస్‌ అధికారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కుటుంబవిలువలు, యాక్షన్‌, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది’ అని నిర్మాత చెప్పారు. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు.