శనివారం 16 జనవరి 2021
Cinema - Apr 21, 2020 , 23:13:26

వదంతులు నమ్మొద్దు

వదంతులు నమ్మొద్దు

అనుష్క కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ నిర్మాతలు. ఈ నెలలోనే విడుదలకావాల్సి ఉంది. కరోనా ప్రభావంతో రిలీజ్‌ను వాయిదా వేశారు.  ఈ సినిమా విషయంలో కొందరు తారాలు చిత్ర బృందానికి సహాయనిరాకరణ చేస్తున్నారని, సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారని పుకార్లు వెలువడ్డాయి. వీటిని నమ్మొద్దని చిత్ర బృందం ఓ ప్రకటనలో కోరింది. ‘షూటింగ్‌ మొదలైప్పటి నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ సినిమాకు మూలస్తంభాల్లా నిలిచారు. క్లిష్ట సమయాల్లో కూడా మాకు మద్దతుగా ఉన్నారు.

ముఖ్యంగా కథానాయిక అనుష్క  సహకారం మరువలేనిది. ఈ సినిమాకు సంబంధించి బయట వస్తున్న ఎలాంటి పుకార్లను నమ్మొద్దు. ఈ చిత్రం తాలూకు  ఏ నిర్ణయాన్ని అయినా అధికారికంగా మేమే తెలియజేస్తాం’ అని నిర్మాణ సంస్థ పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అనుష్క.. సాక్షి అనే మూగ, చెవిటి మహిళ పాత్రలో నటిస్తోంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించారు. మాధవన్‌, అంజలి, మైఖేల్‌ మ్యాడ్‌సన్‌,  షాలినిపాండే, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షానియల్‌ డియో, సంగీతం: గోపీసుందర్‌, సహనిర్మాత: వివేక్‌ కూఛిబొట్ల, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: కోన వెంకట్‌, కథ, దర్శకత్వం: హేమంత్‌ మధుకర్‌.