సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 00:35:20

వచ్చే ఏడాదే సెట్స్‌లో అడుగుపెడతా!

వచ్చే ఏడాదే సెట్స్‌లో అడుగుపెడతా!

‘లాక్‌డౌన్‌ విరామంలో చాలా  కొత్త విషయాల్ని నేర్చుకున్నా. వేర్వేరు ప్రదేశాల్లో ఉండే కుటుంబమంతా ఒకేచోటికి చేరుకున్నాం. అందరితో  సంతోషంగా సమయాన్ని ఆస్వాదించా.   అలాగే వివిధ భాషలకు చెందిన సినిమాలు చాలా చూశా’ అని చెప్పింది అనుష్క. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి పాత్రికేయులతో అనుష్క పంచుకున్న ముచ్చట్లివి....

ఓటీటీలో ఈ సినిమా విడుదలకావడం ఎలా అనిపిస్తోంది? నటిగా ఈ సినిమాతో మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

ఓటీటీ అనేది నాతో  పాటు ఇండస్ట్రీలోని అందరికీ కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా సినిమాను విడుదల చేయడం మినహా వేరే మార్గం కనిపించడం లేదు.  ఈ మార్పును అందరూ పాజిటివ్‌గా స్వీకరించాల్సిన అవసరముంది.  ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నటిగా ఈ సినిమా నాకో సవాల్‌గా నిలిచింది. ఇందులో సాక్షి అనే మూగ, చెవిటి అమ్మాయిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం రెండు నెలలు కష్టపడి  ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నా.  సైన్‌ లాంగ్వేజ్‌లో చాలా రకాలుంటాయి. ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుందని తర్వాత తెలిసింది.  అది అర్థం చేసుకుంటూ నటించడం కొత్త అనుభూతిని పంచింది.  అమెరికన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కావడంతో ఆ దేశంలో ఉపయోగించే సైన్‌ లాంగ్వేజ్‌పై పట్టు సాధించా.  విభిన్నమైన సినిమాలు చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. 

ఈ సినిమా కథలో నచ్చినదేమిటి?

‘భాగమతి’ తర్వాత  వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలనే ఆలోచనతో  సినిమాలకు బ్రేక్‌ తీసుకున్నా. ఆ సమయంలో కోన వెంకట్‌ ఈ పాయింట్‌ చెప్పారు. నా పాత్ర చిత్రణ కొత్తగా ఉండటంతో పాటు తక్కువ టైమ్‌లో పూర్తిచేసే అవకాశమున్న కథ కావడంతో వెంటనే ఈ సినిమాను అంగీకరించా. పూర్తి కథ కూడా వినలేదు. 

‘ఆదిపురుష్‌'లో మీరు సీత పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి?

ఆ సినిమా గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఆ సినిమాలో నటించడం లేదు.

కొత్త దర్శకుడిని నమ్మి సినిమా అంగీకరించడానికి కారణమేమిటి?

సినిమాల విషయంలో కథ, దర్శకుడిని ప్రతిభను మాత్రమే నమ్ముతా. డైరెక్టర్స్‌ యాక్టర్‌గానే ఉండటమే నాకు ఇష్టం.  దర్శకుడి ఎక్స్‌పీరియన్స్‌ గురించి పట్టించుకోను. వినూత్నమైన కథాంశంతో హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు విజన్‌ను పూర్తిగా నమ్మి ఈ సినిమా చేశా.  స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. 

సినిమా పూర్తి భారం మీపైనే ఉంది కదా. అదేమైనా ఒత్తిడిగా అనిపించిందా?

పూర్తిగా ఒకరి ఇమేజ్‌పైనే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయని నేననుకోను.  సినిమా అనేది సమిష్టి కృషిగా భావించాలి. నటీనటులు, సాంకేతిక నిపుణుల అందరూ బాధ్యతతో పనిచేసినప్పుడే సినిమా బాగా వస్తుంది.  అయితే నటీనటులపై కొంత ఒత్తిడి ఉంటుంది. అది సర్వసాధారణం. అది ఒక్క సినిమాకే కాదు అన్ని సినిమాలకు అలాగే ఉంటుంది. 

గతంలో మీరు నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో పోలిస్తే ఇందులో ఎలాంటి వైవిధ్యత ఉంటుంది?

థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథలో నాతో పాటు ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.  సాక్షి అనే అమ్మాయితో మిగిలిన పాత్రలకున్న సంబంధమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. కథ, కథనాల పరంగా గత చిత్రాలతో ఎలాంటి పోలికలు ఉండవు. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరణ చేశాం.  సినిమాల్లోకి వచ్చిన తర్వాతే నటన, డైలాగ్స్‌ చెప్పడం, డ్యాన్స్‌ నేర్చుకున్నా.  కానీ ఆ అనుభవాలు ఈ సినిమాకు ఉపయోగపడలేదు. ఇందులో నా పాత్రకు అసలు డైలాగ్స్‌  ఉండవు.  డైలాగ్స్‌ లేకుండా తెరపై ఎలా నటించాలన్నది సవాలుగా అనిపించింది. అయితే పాత్రలోని కొత్తదనం నాకు ప్రేరణనిచ్చింది. 

 పాన్‌ ఇండియన్‌ సంస్కృతిపై మీ అభిప్రాయమేమిటి?

గత కొంతకాలంగా సినిమాలపరంగా ఉన్న భాషాభేదాల హద్దులన్నీ తొలగిపోతున్నాయి. పాన్‌ ఇండియన్‌ సంస్కృతి పెరుగుతోంది. . కథలు చెప్పే తీరు, సాంకేతికతలో మార్పు వస్తోంది.  మన సినిమాల పరిధి విస్త్రతమవుతోంది. దక్షిణాది సినిమాలు విదేశాల్లో ఆదరణ పొందుతున్నాయి. అందుకు ‘బాహుబలి’ సినిమానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

లాక్‌డౌన్‌ విరామం తర్వాత ఎప్పుడు షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నారు?

 ఈ ఏడాది షూటింగ్స్‌లో పాల్గొనే ఆలోచన లేదు. వచ్చే ఏడాది నా సినిమాలు సెట్స్‌పైకి వస్తాయని అనుకుంటున్నా. దర్శకనిర్మాతల ప్రకటనలను అనుసరించే  షూటింగ్‌ ప్రారంభం ఎప్పుడనేది నిర్ణయం కానుంది.  లాక్‌డౌన్‌కు ముందు మూడు సినిమాల్ని అంగీకరించా.  వాటికి సంబంధించిన వివరాల్ని చిత్రబృందాలు తెలియజేస్తాయి.

మాధవన్‌, మైఖైల్‌ మ్యాడసన్‌ లాంటి ప్రతిభావంతులైన నటులతో సినిమా చేయడం ఎలాంటి అనుభూతిని పంచింది?

కెరీర్‌ తొలినాళ్లలో మాధవన్‌తో కలిసి ఓ తమిళ సినిమా చేశా. మళ్లీ పదమూడేళ్ల తర్వాత ఆయనతో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రయాణంలో మాలో వచ్చిన పరిణితి, నేర్చుకున్న విషయాల్ని గురించి సెట్స్‌లో చర్చించుకున్నాం. సెట్స్‌లో మైఖైల్‌ మ్యాడ్‌సన్‌ తన కెరీర్‌ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇతర భాషల నటీనటులతో పనిచేయడాన్ని ఆస్వాదిస్తా. భిన్న సంస్కృతులు, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.

వెబ్‌సిరీస్‌లలో నటించే ఆలోచన ఉందా?

వెబ్‌సిరీస్‌లో అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకున్న కమిట్‌మెంట్స్‌ కారణంగా దేనికీ సంతకం చేయలేదు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో తప్పకుండా వెబ్‌సిరీస్‌లో నటిస్తా. logo