సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 02:20:07

అనురాగ్‌కశ్యప్‌ నన్ను వేధించారు

అనురాగ్‌కశ్యప్‌ నన్ను వేధించారు

  • బాలీవుడ్‌లో మళ్లీ ‘మీటూ’ కలకలం      
  • ఆరోపణల్ని ఖండించిన అనురాగ్‌కశ్యప్‌

రెండేళ్ల క్రితం ‘మీటూ’ ఉద్యమం దేశాన్ని కుదిపివేసింది. ముఖ్యంగా సినీరంగంలోని పలువురు నటీమణులు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని వివిధ వేదికల మీద ధైర్యంగా గళం విప్పారు. ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో తాజాగా బాలీవుడ్‌ కథానాయిక పాయల్‌ఘోష్‌ దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. 2014లో అనురాగ్‌కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరేళ్ల క్రిందటి సంఘటన గురించి సంచలన విషయాల్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘అనురాగ్‌కశ్యప్‌ ఫోన్‌ చేస్తే ఓ రోజు ఆయన ఇంటికి వెళ్లాను. ఆ టైమ్‌లో ఆయన రణభీర్‌కపూర్‌తో ‘బాంబే వెల్వెట్‌' సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. 

నేను  ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన సిగరెట్‌ తాగుతూ కనిపించారు. నాతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మరో రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా దుస్తులు మొత్తం విప్పాలని అడిగాడు. నాకు ఇష్టంలేదని వారించాను. ‘ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే ఎందరో కథానాయికలు నా దగ్గరకు వస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ సాధారణ విషయాలే’ అంటూ నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అతికష్టం మీద నేను అక్కడి నుంచి బయటపడ్డాను’ అని పాయల్‌ఘోష్‌ చెప్పింది. ‘మీటూ’ ఉద్యమ సమయంలో ఈ సంఘటన గురించి ఎందుకు ప్రస్తావించలేదని అడగ్గా ‘నా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులకు ఈ విషయం తెలుసు. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే మౌనంగా ఉండటమే మేలని వారు సలహా ఇచ్చారు. ఇలాంటి విషయాల్ని బయటకు వెల్లడిస్తే  సినిమా అవకాశాలు దక్కవని భయపెట్టించారు’ అని తెలిపింది. ఈ సంఘటన తర్వాత తానెంతో మానసిక సంఘర్షణకు లోనయ్యానని..ఇప్పుడు బయటపెట్టడంతో కాస్త మనశ్శాంతి దొరికినట్లయిందని పాయల్‌ఘోష్‌ చెప్పింది. తెలుగు చిత్రం ‘ప్రయాణం’ (2009)  ద్వారా పాయల్‌ఘోష్‌ కథానాయికగా కెరీర్‌ ఆరంభించింది.

ప్రధానికి ఫిర్యాదు..

అనురాగ్‌కశ్యప్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పాయల్‌ఘోష్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించాలని ట్విట్టర్‌ ద్వారా పీఎంవో, ప్రధానిని కోరింది. ‘అనురాగ్‌ నాతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అతనిపై చర్యలు తీసుకోండి’ అని ట్విట్టర్‌లో అభ్యర్ధించింది. ఈ సందర్భంగా పాయల్‌ఘోష్‌కు కంగనారనౌత్‌ మద్దతు ప్రకటించింది. అనురాగ్‌కశ్యప్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది.

నిరాధారమైన ఆరోపణలు- అనురాగ్‌ కశ్యప్‌

పాయల్‌ఘోష్‌ చేసిన ఆరోపణల్ని అనురాగ్‌కశ్యప్‌ ఖండించారు. ‘నాపై ఆరోపణలు చేసే క్రమంలో అమితాబ్‌బచ్చన్‌ కుటుంబాన్ని, కొందరు కథానాయికల్ని ఈ వివాదంలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఓ దర్శకుడిగా ఎంతో మంది నాయికలతో చర్చలు జరుపుతుంటాను. ఇప్పటివరకు ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నాపై చేసిన ఆరోపణల్లో నిజానిజాలేమిటో భవిష్యత్తులో తేలుతుంది’ అని అనురాగ్‌కశ్యప్‌  చెప్పారు. ఆయనకు మాజీ భార్య ఆర్తి బజాజ్‌తో పాటు కథానాయికలు తాప్సీ, సుర్వీన్‌చావ్లా, అంజనాసుఖానీ, దర్శకుడు అనుభవ్‌సిన్హా మద్దతుగా నిలిచారు.


logo