శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Cinema - Mar 24, 2020 , 12:12:51

నేటి దూరం..రేప‌టి క‌ల‌యిక కోస‌మే..

నేటి దూరం..రేప‌టి క‌ల‌యిక కోస‌మే..

క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతంగా ప్ర‌బ‌లుతున్న ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సోష‌ల్ డిస్టాన్సింగ్స్ తప్ప‌నిస‌రి అంటున్నారు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్‌ఖేర్‌. సాంఘిక‌దూరం పాటిస్తుండ‌టం వ‌ల్ల త‌న ఇంటిప‌క్క‌నే ఉండే చిర‌కాల మిత్రుడు అనిల్‌క‌పూర్‌ను సైతం క‌ల‌వ‌కుండా ఉంటున్నాన‌ని అనుప‌మ్‌ఖేర్ పేర్కొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ప‌క్షుల కిల‌కిల‌రావాలు, ప్ర‌శాంత‌మైన ప్ర‌కృతి న‌డుమ ఇంటి బాల్క‌నీ నుంచి తీసుకున్న ఈ  వీడియోలో అనుప‌మ్‌ఖేర్ సాంఘిక దూరం పాటించే అవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. నేను విదేశీ ప్ర‌యాణాల్ని ముగించుకొని ఎప్పుడు ఇండియాకు వ‌చ్చిన తొలుత నా ప్రియ మిత్రుడు అనిల్‌క‌పూర్ ఇంటికే వెళ్లాను. ఆ త‌ర్వాతే నా ఇంటిలో అడుగుపెడ‌తాను. అదొక ఆన‌వాయితీగా మారింది. కానీ ఇప్పుడు గొప్ప సామాజిక బాధ్య‌త‌తో న‌ల‌భైఏళ్ల నుంచి స్నేహ‌బంధాన్ని కొన‌సాగిస్తున్న ప్రియ‌మిత్రుడికి కూడా దూరంగా ఉంటున్నా. నేడు మ‌నంద‌రం పాటించే ఈ దూరం రేప‌టి  అపూర్వ భ‌విష్య‌త్తుకు దారి చూపిస్తుంది. అన‌వ‌స‌ర ఆలోచ‌న‌ల్ని, బ‌రువుని దించుకొని జీవితాన్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసుకోవ‌డానికి దేవుడు మ‌న‌కు ఈ ఏకాంతాన్ని, నిర్భంధాన్ని విధించాడ‌నే ఆశావ‌హ ధృక్ప‌థాన్ని అంద‌రం అల‌వ‌ర్చుకోవాలి అని వ్యాఖ్యానించారు అనుప‌మ్‌ఖేర్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో సాంఘిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌లే న్యూయార్క్ నుంచి తిరిగొచ్చిన ఆయ‌న స్వీయ గృహ నిర్భంధంలో ఉంటున్నారు.logo