రియల్ హీరో సోనూసూద్ లాక్ డౌన్ కష్టకాలంలో ఎన్నో సాయాలు చేసి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ ఆయన సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తన సోషల్ మీడియాలో చిరు వ్యాపారులను సపోర్ట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నాడు.
రోడ్డు పక్కన ఉన్న చిన్నపాటి వ్యాపారులకి ఉచితంగా ప్రమోషన్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు సోనూసూద్. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్న సోనూసూద్.. రహదారుల వెంట దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం ఆ తర్వాత పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం , జ్యూస్ స్టాల్లో జ్యూస్ అమ్మడం, చెప్పులను కొనుక్కోమనని చెప్పడం ద్వారా చిరు వ్యాపారులకి అండగా నిలుస్తున్నాడు.
తాజాగా మొక్కజొన్న పొత్తుల వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. వర్షా కాలంలో మొక్కజొన్నలకు మంచిగిరాకీ ఉంటుందని చెప్పిన సోనూ..వాటిని కాలుస్తూ ధరలు అడిగి తెలుసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీధి వ్యాపారులని సపోర్ట్ చేస్తూ సోను చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.