గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 03:09:56

తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాం

తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాం

కథ, హీరోఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొనే సినిమాలకు సంగీతాన్ని అందిస్తుంటానని అన్నారు అనూప్‌రూబెన్స్‌. మనం, కాటమరాయుడు, గోపాలగోపాల లాంటి సినిమాలతో ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించిన తాజా చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’.  రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 2న  ఆహా యాప్‌ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అనూప్‌ రూబెన్స్‌ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్‌  ఎంటర్‌టైనర్‌ ఇది.  అంతర్లీనంగా చక్కటి సందేశముంటుంది.  ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒకలైలా కోసం’ తర్వాత దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండాతో నేను చేసిన మూడో సినిమా ఇది.  ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే భావోద్వేగానికి లోనుచేస్తుంది. రాజ్‌తరుణ్‌, సప్తగిరి, నరేశ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి.  కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. పాటలన్నీ సందర్భానుసారం వస్తాయి. ఇందులో నేను స్వరపరచిన పాటల్లో  ‘ఈ మాయ పేరేమిటో..’ గీతం వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చింది. మిగిలిన గీతాలకు చక్కటి ఆదరణ లభిస్తోంది. తెలుగులో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతుంది. మాస్‌, క్లాస్‌, రొమాన్స్‌, యాక్షన్‌ లాంటి   భిన్నమైన జోనర్స్‌కు సంగీతాన్ని అందించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను.  ‘

బాలు అంకితభావానికి నిదర్శనం

నా స్వరసారధ్యంలో ఎక్కువగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు.  వయసుతో సంబంధం లేకుండా అందరితో సరదాగా కలిసిపోతుంటారాయన. దక్షిణాది సంగీత ప్రపంచానికి బాలు తండ్రి లాంటివారు. ఆ గౌరవస్థానం ఆయనదే. బాలు మరణంతో తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయిన భావన కలుగుతోంది.  ఎంతటి సంక్లిష్టమైన పాటనైనా త్వరగా పాడుతుంటారు బాలు. ప్రస్తుతం చాలా మంది నూతన  గాయకులు నేరుగా రికార్డింగ్‌ థియేటర్‌కు వచ్చి పాటలు పాడుతున్నారు.  కానీ బాలసుబ్రహ్మణ్యం మాత్రం పాట పాడటానికి ముందు ప్రాక్టీస్‌ చేసేవారు.అది ఆయన అంకితభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. లాక్‌డౌన్‌ కారణంగా ఏడు నెలల పాటు మనుషులెవరూ లేని ఏకాంత ప్రదేశంలో బందీ అయిపోయినా ఫీలింగ్‌ కలిగింది. ప్రీరిలీజ్‌ వేడుకతో మళ్లీ అందరి ముందుకు రావడం ఆనందంగా అనిపించింది.

నీలి నీలి ఆకాశం...

‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా కోసం నేను స్వరపరచిన ‘నీలి నీలి ఆకాశం..’ పాటకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ‘మనం’ తర్వాత మళ్లీ నాకు ఆ స్థాయిలో  పేరుతెచ్చిన మంచి పాట ఇది. నా సినీ ప్రయాణంలోనే మరపురాని పాట ఇదంటూ  ప్రతి ఒక్కరూ చెబుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. స్వరకర్తగా మెలోడీ గీతాలకు సంగీతాన్ని అందించడాన్ని ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తుంటా. అలాగని ఒకే ఒరవడికి పరిమితం కాను.  సినిమాకు తగినట్లుగా అన్ని రకాల పాటల్ని సమకూర్చడానికే ఇష్టపడతాను. logo